కాపుల కోసం బాబు ఏమి చేయబోతున్నారంటే ?
ఏపీలో బలమైన సామాజిక వర్గంగా కాపులు ఉన్నారు. వారు ప్రతీ ఎన్నికకూ ఒక పార్టీకి మద్దతు ఇస్తూ ఉంటారు.
By: Tupaki Desk | 25 Oct 2024 5:30 AM GMTఏపీలో బలమైన సామాజిక వర్గంగా కాపులు ఉన్నారు. వారు ప్రతీ ఎన్నికకూ ఒక పార్టీకి మద్దతు ఇస్తూ ఉంటారు. అలా 2004లో కాంగ్రెస్ కి 2009లో ప్రజారాజ్యానికి 2014లో టీడీపీకి, 2019లో వైసీపీకి 2024లో టీడీపీ కూటమికి మద్దతుగా నిలిచారు. కాపులు ఎటు వైపు ఉంటే వారిదే విజయం అన్నది కూడా చరిత్ర నిరూపించిన విషయం.
ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో జనసేన కూడా టీడీపీ కూటమి పొత్తులో ఉండడం సైతం అనుకూలించింది. పవన్ మీద కాపులు కోటి ఆశలు పెట్టుకున్నారు. అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఘట్ బంధన్ కి వారు ఓటు వేశారు. ఈ కూటమి సక్సెస్ కావాలని బలంగా ఆకాంక్షించారు.
అందుకే గోదావరి జిల్లాలలో ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కకుండా అన్నీ కూటమి అభ్యర్ధులే గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ కూటమి బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అందులో కాపులది ప్రధాన వాటా ఉంది. దాంతో వారంతా కూటమి ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు.
తమకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాపులకు రానున్న అయిదేళ్ల కాలంలో పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
ఈ మొత్తం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాపు భవనాల నిర్మాణాలతో యువతకు అన్ని విధాలా అండగా నిలిచేలా కార్యచరణ సిద్ధం చేశారని మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గానికి సీఎం చంద్రబాబు నాయుడు తోనే మేలు కలుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
కాపుల అభివృద్ధికి 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు అమలుచేసిన పథకాన్నింటినీ తిరిగి అమలు చేస్తామని ఆమె ప్రకటించారు. అప్పట్లో కాపు సామాజిక వర్గంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు విద్య, ఉద్యోగావకాశాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో కాపులకు మంచి రోజులు వచ్చాయని ఆమె అన్నారు. గడిచిన ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి సీఎం చంద్రబాబు చిత్తశుద్దితో ఉన్నారన్నారు.
మొత్తం మీద చూస్తే చంద్రబాబు బలమైన కాపు సామాజిక వర్గానికి తగిన విధంగా న్యాయం చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలెట్టారని అర్ధం అవుతోంది. అయిదేళ్ళకూ పదిహేను వేల కోట్లు అంటే ఏడాదికి మూడు వేల కోట్లు అన్న మాట. ఇది నిజంగా కాపు సమాజాభివృద్ధికి ఎంతో మేలు చేసేదే అని అంటున్నారు.
వీటితో పాటు కాపులకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి అయిదు శాతం రిజర్వేషన్లు కూడా ఇవ్వాలన్న డిమాండ్ ఉంది.గతంలో బాబు అధికారంలో ఉన్నపుడు అదే విధంగా చేశారు. ఈసారి కూడా చేస్తే కాపులు బాబుకు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు అని అంటున్నారు. బాబు మదిలో ఈ విషయం కూడా ఉంటుందని అంటున్నారు. సో కాపులకు బాబే న్యాయం చేస్తారు అని టీడీపీ మంత్రులు పూర్తి ధీమాతో చెబుతున్నారు