Begin typing your search above and press return to search.

98 శాతం సంతృప్తి పైనే చంద్ర‌బాబు ఫోక‌స్‌.. ఏం చేస్తున్నారంటే.. !

మెజారిటీ ప్ర‌జ‌లు సూప‌ర్ సిక్స్ కోసం ఎదురు చూస్తున్న‌ట్టు సర్వేల్లో స్ప‌ష్ట‌మైంది. దీనిపై వెంట‌నే రియాక్ట్ అయిన‌.. చంద్ర‌బాబు మీడియా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Feb 2025 1:30 PM GMT
98 శాతం సంతృప్తి పైనే చంద్ర‌బాబు ఫోక‌స్‌.. ఏం చేస్తున్నారంటే.. !
X

కూట‌మి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో తెలుసుకునేందుకు కూట‌మి సార‌థి.. సీఎం చంద్రబాబు ఇప్ప‌టికి రెండు ర‌కాలుగా స‌ర్వే చేయించారు. ఒక‌టి పార్టీ నాయ‌కుల ద్వారా స‌ర్వే చేయించ‌గా.. రెండోది అధికారుల‌తో ఐవీఆర్ ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా స‌ర్వే చేయించారు. ఈ స‌ర్వేల్లో స‌ర్కారుకు అందిన ప్ర‌తిపాద‌న‌లు.. ప్ర‌జ‌ల సంతృప్తి అసంతృప్తిపై సీఎం లెక్క‌లు వేసుకున్నారు. దీని ప్ర‌కారం ముందుకు సాగాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు.

మెజారిటీ ప్ర‌జ‌లు సూప‌ర్ సిక్స్ కోసం ఎదురు చూస్తున్న‌ట్టు సర్వేల్లో స్ప‌ష్ట‌మైంది. దీనిపై వెంట‌నే రియాక్ట్ అయిన‌.. చంద్ర‌బాబు మీడియా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇక‌, సంతృప్తిలో ముందున్న అంశాల‌పై కూడా చంద్ర‌బాబు లెక్క‌లు వేసుకున్నారు. 98 శాతం మంది నెలా నెలా అందుతున్న సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల విష‌యంలో సంతృప్తిగా ఉన్నార‌ని తెలిసింది. అయితే.. చిన్న చిన్న పొర‌పాట్లు జ‌రుగుతున్నాయ‌ని.. కొన్ని చోట్ల పింఛ‌ను దారులు సుదూరాలు ప్ర‌యాణించి పింఛ‌ను తీసుకోవాల్సి వ‌స్తోంద‌ని కూడా స‌ర్కారు దృష్టికి వ‌చ్చింది.

అదే స‌మ‌యంలో ఉద‌యం 6 గంట‌ల నుంచి పింఛ‌న్లు ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా.. అది 8 గంటల త‌ర్వాత కానీ ప్రారంభం కావ‌డం లేద‌ని కూడా ప్ర‌భుత్వానికి లెక్క‌లు చేరాయి. ఈ నేప‌థ్యంలో సంతృప్తి ఎక్కువ‌గా ఉన్న‌.. పింఛ‌న్ల పంపిణీని మ‌రింత బ‌లోపేతం చేసుకునే దిశ‌గా సీఎం చంద్ర‌బాబు రెడీ అయ్యారు. ఇత‌ర అంశాల మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. సంతృప్తి విష‌యంలో పింఛ‌న్ల ప‌రిస్తితి బాగానే ఉన్న నేప‌థ్యంలో దీనిని మ‌రింత ప‌క్కాగా నిర్వ‌హించి.. 100కు 200 శాతం మార్కులు సంపాయించుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇక నుంచి అంటే.. వ‌చ్చే నెల నుంచి పింఛ‌న్ల‌ను తెల్ల‌వారు జామున 5 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల మ‌ధ్య రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం పింఛ‌న్లు పంపిణీ పూర్తి చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. అదేవిధంగా 10 శాతం 7 గంట‌ల లోపు, మిగిలిన 10 శాతం.. పంపిణీ 8 గంట‌ల క‌ల్లా పూర్తి చేయాల‌ని చంద్ర‌బాబు నిర్దేశించారు. దీనిని క‌లెక్ట‌ర్లు ప‌ర్య‌వేక్షించాల‌ని.. చెప్పిన స‌మ‌యం దాటితే క‌లెక్ట‌ర్లే బాధ్యులు అవుతార‌ని కూడా చంద్ర‌బాబు నిర్దేశించ‌డం గ‌మ‌నార్హం. అంటే.. 98 శాతం సంతృప్తిని మ‌రింత పెంచుకునేందుకు స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని అధికారులు చెబుతున్నారు.