'తమ్ముళ్లను' కూడా వదలట్లేదు.. బాబుకు భారీ హెడేక్!
గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసినవారిని.. వైసీపీ వేధింపులు తట్టుకుని నిలబడిన నాయకులకు పార్టీ తరఫున అండగా నిలవాల్సిన అవసరం ఉందని కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
By: Tupaki Desk | 16 March 2025 8:00 AM ISTఏపీ సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోని పలు కార్పొరేష న్లు, ఆలయాల ట్రస్టు బోర్డులు, స్థానిక పదవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఆయా పదవులను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో నాయకులను ఎంపిక చేసి.. తనకు జాబితా పంపాలని ఆదేశించారు. ప్రతి ఎమ్మెల్యే కూడా యాక్టివ్‌గా పనిచేయాలని సూచించారు.
గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసినవారిని.. వైసీపీ వేధింపులు తట్టుకుని నిలబడిన నాయకులకు పార్టీ తరఫున అండగా నిలవాల్సిన అవసరం ఉందని కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే.. ఇది జరిగి వారం అయినా.. ఎమ్మెల్యేల నుంచి ఒక్క పేరు కూడా బయటకు రాలేదు. అంతేకాదు.. ఎవరూ సీఎం వోకు కానీ.. వ్యక్తిగతంగా చంద్రబాబుకు కానీ.. ఏ ఒక్కరినీ సిఫారసు చేయలేదు. దీంతో ఈ విషయాన్ని చం ద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతోందో పరిశీలించాలని నిర్ణయిం చారు.
ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగు చూసినట్టు సమాచారం. గత ఎన్నికల్లో పనిచేసిన వారు ఎవరు? అనేది పక్కన పెడితే.. ఆయా పదవులకు ఎమ్మెల్యేలు.. తమకు విధేయులుగా ఉన్నవారు.. తమ మాట వినేవారిని ఎంపిక చేసుకోవడం తప్పుకాదు. కానీ.. ఈ విషయంలోనూ చేతులు తడుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదవుల స్థాయిని బట్టి.. సొంత నాయకుల నుంచే రేటు కట్టి వసూలు చేసుకునే వ్యవహారానికి తమ్ముళ్లు తెరదీశారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
వాస్తవానికి గత వారం కూడా.. సీఎం చంద్రబాబు పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను గట్టిగానే హెచ్చరించా రు. పక్కదారులు పట్టొద్దని, పార్టీపరువును పోగొట్టద్దని కూడా హెచ్చరించారు. ఇసుక, మద్యం, మట్టి, భవన నిర్మాణాల అనుమతుల విషయంలో జరుగుతున్న అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్న క్రమంలో సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. కానీ, ఇప్పుడు సొంత పార్టీలో పదవుల కోసం ఎంపిక చేపట్టాల్సిన సమయంలో సొంత వారి నుంచి కూడా సొమ్ములు ఆశిస్తున్నారన్న ఫిర్యాదులు రావడం గమనార్హం. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.