దేశంలో తొలిసారి పర్యాటకంగా "సీ ప్లేన్" వినియోగం... బాబు ప్రయాణం!
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 9 Nov 2024 9:51 AM GMTఅటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధినీ తనదైన స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు... ఆంధ్రప్రదేశ్ లో "సీ ప్లేన్" పర్యాటకాన్ని ప్రారంభించారు. దీంతో.. దేశంలో తొలిసారి పర్యాటకంగా "సీ ప్లేన్" వినియోగం ఏపీ నుంచి ఆరంభమైనట్లు అయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... దేశంలోని తొలిసారి పర్యాటకంగా "సీ ప్లేన్" వినియోగం ఏపీ నుంచి ప్రారంభం అయ్యింది! ఈ పర్యాటకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా... విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకూ చంద్రబాబు, రామ్మోహన్ నాయుడితో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రయాణించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. తక్కువ సమయంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని.. కేంద్ర మంత్రివర్గంలో అత్యంత యువకుడు అని బాబు కొనియాడారు. ఈ సందర్భంగా... భవిష్యత్తులో ఇక ఏ ఇజం ఉండదని.. టూరిజం ఒకటే ఉంటుందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో... రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని.. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని.. వేగంగా పెరుగుతోన్న సాంకేతికతను పూర్తిగా వినియోగించుకోవాలని.. రాబోయె రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా.. సీ ప్లేన్ ద్వారా కూడా రవాణా సౌకర్యం లభిస్తుందని చంద్రబాబు తెలిపారు.
ఇదే క్రమంలో... రాష్ట్రంలో పోగొట్టిన బ్రాండ్ ను తిరిగి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నామని.. విధ్వంసమైన వ్యవస్థను బాగుచేసేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నామని.. గడిచిన ఎన్నికల్లో ఏపీ ప్రజలు గెలిచారని, రాష్ట్రాన్ని నిలబెట్టారని.. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇక విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకూ "సీ ప్లేన్" ని ప్రారంభించిన చంద్రబాబు.. అందులో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.