Begin typing your search above and press return to search.

చంద్రబాబు మీద క్యాడర్ కి మక్కువ...కానీ లోకేష్ మీద ?

తెలుగుదేశం పార్టీని మూడు దశాబ్దాలుగా చంద్రబాబు తన భుజాలకు ఎత్తుకుని మోస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 March 2025 7:00 PM IST
చంద్రబాబు మీద క్యాడర్ కి మక్కువ...కానీ లోకేష్ మీద ?
X

తెలుగుదేశం పార్టీని మూడు దశాబ్దాలుగా చంద్రబాబు తన భుజాలకు ఎత్తుకుని మోస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి 1995లో చంద్రబాబు అధ్యక్షుడు అయ్యారు. అంతకు ముందు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 14 ఏళ్ళ పాటు టీడీపీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలా ఎన్టీఆర్ పార్టీని స్థాపించినా దానికి అన్న గారి కంటే అల్లుడు చంద్రబాబే రెట్టింపు కాలం నాయకత్వం వహించారు అన్నది వాస్తవం.

ఇక టీడీపీని క్యాడర్ బేస్డ్ పార్టీగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరు. ఆయన పార్టీకి క్యాడర్ ని తిరుగులేని సైన్యంగా మార్చారు. చంద్రబాబు అంటేనే టీడీపీ అన్నట్లుగా ఆయన పార్టీని మార్చారు. టీడీపీలో క్యాడర్ కి కూడా బాబు అంటే అభిమానం. ఆయన అంటేనే అపారమైన నమ్మకం అని చెప్పాల్సి ఉంది. ఆ విధమైన భావనను కల్పించారు అంటే అది చంద్రబాబు దృఢమైన నాయకత్వం లక్షణాల వల్లనే అని చెపుకోవాలి.

టీడీపీలో ఈ రోజుకు ఉన్న నాయకులు అందరికీ జూనియర్లు సీనియర్లు అన్న తేడా లేకుండా చంద్రబాబు మీదనే అపారమైన నమ్మకం ఉందని చెప్పవచ్చు. చంద్రబాబు బహుముఖమైన ప్రజ్ఞా ధురీణుడుగా కనిపిస్తారు. మీడియాను ఎలా మేనేజ్ చేయాలో పార్టీ నేతలను ఎలా మేనేజ్ చేయాలో లేక పాలన ఎలా సాగించాలో చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అని అంటున్నారు.

అందుకే చంద్రబాబు మీద టీడీపీ లీడర్స్ కి క్యాడర్ కి అంత నమ్మకం. అయితే నాలుగున్నర పదుల వయసులో పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ఇపుడు ఏడున్నర పదుల వయసుకు వచ్చారు. ఆయనకు ఇపుడు ఏజ్ సమస్య ఉంది. దాంతో బాబు తరువాత టీడీపీ పరిస్థితి ఏంటి అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఇదే విషయం ఈ మధ్య చర్చకు వచ్చినపుడు బాబు తరువాత లోకేష్ కదా అని సీనియర్ నేత మంత్రి అచ్చెన్నాయుడు కూడా అన్నారు. అయితే బాబు చాటుగా ఉంటూ ఈ రోజున లోకేష్ పార్టీ వ్యవహారాలు అన్నీ చూస్తున్నారు. ఏ విషయం అయినా ఏమి చేసినా అవన్నీ బాబు పేరు మీదనే సాగిపోతున్నాయి కాబట్టి ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి. కానీ బాబుని కాస్తా పక్కన పెట్టి లోకేష్ చేతికి పగ్గాలు ఇస్తే ఒంటరిగా ఆయన ఈ మొత్తం వ్యవహారాలను డీల్ చేయగలరా అన్నది ఈ రోజుకీ పార్టీలో చర్చగా ఉంది.

అంతే కాదు లోకేష్ కి అంత సత్తా ఉందా అన్న డౌట్లు కూడా పార్టీ లోపలా బయటా ఉన్నాయి. ఇక బాబుకు పార్టీలో ఉన్నంత ఏకాభిప్రాయం లోకేష్ విషయంలో ఉండే అవకాశం లేదని అంటున్నారు. ఈ రోజుకు చూస్తే కనుక పార్టీలో సీనియర్లకు లోకేష్ కి మధ్య గ్యాప్ ఉందని కూడా అంటున్నారు.

అంతే కాదు బాబు మార్క్ పాలిటిక్స్ వేరు. ఆయన సహనంతో ఉంటారు. ఆవేశం వచ్చినా అణచుకుంటారు. అంతే కాదు ఆయన ఆగ్రహం ధర్మాగ్రహంగా అందరూ అర్ధం చేసుకుంటారు. బాబు అందరి నాయకులకు విలువ ఇస్తారు. ఆయన దగ్గరకు వెళ్ళిన వారు ఎవరైనా మాట వినే వస్తారు.

కానీ లోకేష్ విషయం అలా కాదని అంటున్నారు. ఆయన ఆవేశపరుడు అని అంటున్నారు. అంతే కాదు ఆయనకు తెలుగులో పట్టు లేకపోవడం కూడా ఒక సమస్యగా చెబుతున్నారు. లోకేష్ ప్రసంగాలు చేస్తారు కానీ అవి హుషార్ ఇచ్చే విధంగా ఉండవని అంటున్నారు. అంతే కాదు, మాస్ డైలాగ్స్ ఆయన స్పీచ్ లో పెద్దగా ఉండవని అంటున్నారు.

లోకేష్ సమకాలీన రాజకీయ నేతలుగా జగన్ ని పవన్ ని తీసుకోవాలి. ఈ ఇద్దరి నేతలతో పోలిస్తే లోకేష్ కి వారికి ఉన్నంత మాస్ ఫాలోయింగ్ లేదని కూడా విశ్లేషణలు ఉన్నాయి. కేవలం చంద్రబాబుని చూసి ఆయన ఫాలోయింగ్ ని చూసే టీడీపీ ఈ రోజు మనుగడ సాగిస్తోంది అని అంటున్నారు. లోకేష్ ని ముందు పెడితే బాబు ఫాలోయింగ్ వస్తుందా అన్నది కూడా పార్టీలో సీనియర్ల మధ్య చర్చగా ఉంది అంటున్నారు.

అయితే ఈ మధ్య లోకేష్ కూడా రాజకీయంగా బాగానే రాటు తేలారు అన్నది కూడా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ తరువాత జాతీయ మీడియా ముందు చాలా బాగానే మాట్లాడారు కదా అని అన్న వారూ పార్టీలో ఉన్నారు. ఏది ఏమైనా అర్ధ శతాబ్దం వయసు కలిగిన టీడీపీకి నాయకత్వం వహించడం అంటే ఆషామాషీ వ్యవహారం అయితే కాదు, అందువల్ల చంద్రబాబు స్థాయిలోనే లోకేష్ ని పోల్చి చూస్తారు. అలాగే జగన్ పవన్ లతో నూ కంపేర్ చేస్తారు. ఈ సవాళ్ళు తట్టుకుని లోకేష్ ముందు ముందు ఎలా నాయకత్వాన్ని పెంచుకుంటారో చూడాల్సి ఉంది అంటున్నారు.