Begin typing your search above and press return to search.

16న రేవంత్ రాసిన లెటర్ కు 30న బాబు యాక్షన్ ఇదే

డిసెంబరు 16న తెలంగాణ సీఎం రాసిన లేఖలో.. ‘‘తిరుమలలో వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామికి వందల ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉంది

By:  Tupaki Desk   |   31 Dec 2024 4:40 AM GMT
16న రేవంత్ రాసిన లెటర్ కు 30న బాబు యాక్షన్ ఇదే
X

కలియుగ వైకుంఠంగా కొలిచే తిరుమల శ్రీవారి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలకు సముచిత గౌరవాన్ని ఇచ్చేందుకు వీలుగా సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన లేఖకు.. చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయం ఏమంటే.. రేవంత్ లేఖ రాసిన రెండు వారాల వ్యవధిలోనే చంద్రబాబు నుంచి రియాక్షన్ రావటం.. అది తెలంగాణ ప్రజాప్రతినిధులందరికి సంతోషాన్ని కలిగించేలా ఉండటం ఆసక్తికరంగా మారింది.

డిసెంబరు 16న తెలంగాణ సీఎం రాసిన లేఖలో.. ‘‘తిరుమలలో వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామికి వందల ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. తెలంగాణ నుంచి ప్రతి రోజు కొన్ని వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామి వారిని భక్తితో కొలిచి.. దర్శించుకునే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతునే ఉంది. ఇంతకు ముందు ఉన్న సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఇచ్చే సిపార్సు లేఖల మేరకు స్వామి వారి దర్శనానికి మరియు ఆర్జిత సేవలకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. రాష్ట్రానికి చెందిన ప్రస్తుత ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల సభ్యుల వివరాల్ని జతపర్చటమైనది’ అంటూ లేఖ రాశారు.

దీనికి ప్రతిగా డిసెంబరు 30న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూల నిర్ణయాన్ని తీసుకోవటమే కాదు.. ప్రతి లేఖ రూపంలో తాజాగా తాము తీసుకున్న నిర్ణయాన్ని తెలిపారు. అందులో.. ‘‘మీరు పంపిన లేఖ అందించింది. అందులో పేర్కొన్న అంశాల్ని పరిశీలించాం. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలనే మీ ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకున్నాం. తెలుగుజాతి సత్సంబంధాల నేపథ్యంలో కింద పేర్కొన్న విధంగా అనుమతులు మంజూరు చేయుటకు ఆదేశాలు ఇవ్వటమైనది’ అంటూ స్వీట్ న్యూస్ చెప్పారు.

‘ప్రతి గౌరవ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఎంపీ నుంచి ప్రతి వారం ఏదైనా రెండు రోజులు (సోమ - గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శన్ రూ.500 కొరకు రెండు లేఖలు.. స్పెషల్ ఎంట్రీ దర్శన్ రూ.300 కొరకు రెండు లేఖల్ని స్వీకరించబడతాయి. ప్రతి లేఖలో ఆరుగురు భక్తుల వరకు దర్శనం సిపార్సు చేయొచ్చు’’ అంటూ తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్ చెప్పారు చంద్రబాబు. ఇదంతా బాగానే ఉంది.. తెలంగాణ సీఎం కోరినంతనే స్పందించిన ఏపీ సీఎంకు తగ్గట్లే.. తెలంగాణ సీఎం ఏపీ ప్రజాప్రతినిధులకు ఎలాంటి ఆఫర్ ను ఇవ్వనున్నారు? ఏ అంశంలో సిఫార్సుకు అనుమతి ఇస్తారు? అన్న ప్రశ్నను పలువురు సంధించటం గమనార్హం.