Begin typing your search above and press return to search.

అమరావతి టూ విశాఖ : బాబులిద్దరూ బాగా బ్యాలెన్స్ చేస్తున్నారే !

ఆ మీదట టీడీపీ మరింత ఇబ్బందులు పడుతుంది అనే కదా విశ్లేషణలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   1 April 2025 2:30 AM
అమరావతి  టూ  విశాఖ : బాబులిద్దరూ బాగా బ్యాలెన్స్ చేస్తున్నారే !
X

తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంలో మెచ్చతగిన గుణం ఏంటి అంటే చేసిన తప్పులను సరిచేసుకోవడం. దాని కంటే ముందు తప్పులు చేశామని ఒప్పుకోవడం. సంపూర్ణంగా ఆత్మ విమర్శ చేసుకోవడం. నిజానికి 2019లో టీడీపీకి వచ్చిన 23 సీట్లు బాబు 70 ఏళ్ళ వయసు. జగన్ కి దక్కిన 151 సీట్లు ఆయన 47 వయసు చూసిన వారికి ఏమనిపిస్తుంది. కచ్చితంగా పదేళ్ళ పాటు ఈజీగా వైసీపీ రూలింగ్ లో ఉంటుంది. ఆ మీదట టీడీపీ మరింత ఇబ్బందులు పడుతుంది అనే కదా విశ్లేషణలు వచ్చాయి.

కానీ టీడీపీ పరాజయం నుంచి వెంటనే తేరుకుంది. జరిగిన పొరపాట్లను పునరావృత్తం కాకుండా చూసుకుంది. దాని ఫలితమే పార్టీలో ప్రభుత్వంలో గణనీయమైన మార్పులు అని అంటున్నారు. 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి అని ఎక్కువగా కలవరించింది. అక్కడ ఏమి మేలు జరిగిందో తెలియదు కానీ మొత్తం ఏపీలోని కీలకమైన రీజియన్ల ప్రజానీకం అసంతృప్తికి లోను అయ్యారు.

దానిని వైసీపీ ఎంచక్కా సొమ్ము చేసుకుంది. అయితే అధికారంలోకి వచ్చాక ప్రజా తీర్పుని తప్పుగా అర్ధం చేసుకుని మూడు రాజధానులు అంటూ చేసిన ప్రయోగం విఫలం అయింది. అదే రాజకీయంగా వైసీపీని దెబ్బకొట్టింది. ఇక టీడీపీ విషయానికి వస్తే అమరావతిని 2024 ఎన్నికల తరువాత తమ తొలి ప్రాధాన్యతగా ఎంచుకుంది. పవర్ లోకి వచ్చిన డే వన్ నుంచి రాజధాని పనుల విషయంలో యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసింది.

అదే సమయంలో గతంలోలా కాకుండా రాయలసీమ ఉత్తరాంధ్రాకు కూడా సమన్యాయం చేసేలా ప్రణాళికలను రూపొందించింది. ఇక వైసీపీ విశాఖను రాజధానిగా చేస్తామని ఊరిస్తూ వచ్చింది. దానిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం విశాఖకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోంది. విశాఖను ఐటీ హబ్ గానూ పారిశ్రామిక కేంద్రంగానూ తీర్చిదిద్దడానికి ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటోంది.

అలా విశాఖపట్నం వాసుల కలలను నెరవేర్చే పనిలో సక్సెస్ అవుతోంది. విశాఖను ఐటీ హబ్ గా మారుస్తామని తాజాగా విశాఖ పర్యటనలో మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. విశాఖలో రానున్న అయిదేళ్ళలో ఏకంగా అయిదు లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చేలా చూస్తున్నామని అన్నారు. ఐటీ సెక్టార్ అభివృద్ధికి విశాఖ పూర్తి అనుకూలం అని ఆయన చెప్పారు

మరో వైపు చూస్తే విశాఖలో కొత్త పరిశ్రమలు వస్తున్నాయని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో తరలి వెళ్ళిపోయిన లూలూ కంపెనీ ఇపుడు విశాఖకు వచ్చిందని అన్నారు. అనేక ఇతర పరిశ్రమలకు కూడా శ్రీకారం చుట్టామని అన్నారు. విశాఖలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉందని క్రీడా రాజధానిగా కూడా డెవలప్మెంట్ చేస్తామని అన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం అయితే ఉత్తరాంధ్ర దశ తిరిగిపోతుందని ఆయన చెప్పారు. మూడు జిల్లాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన చెప్పారు. అంతర్జాతీయ నగరంగా ఆర్ధిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని లోకేష్ చెప్పారు. విశాఖ ఏపీకే గొప్ప నగరంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఈ విధంగా ఆయన విశాఖ గురించి గొప్పగా చెప్పడమే కాకుండా విశాఖకు కూటమి ప్రభుత్వం ఏమి చేసింది ఏమి చేయబోతోంది అని చెబుతూ విశాఖ వాసులను ఆకట్టుకుంటున్నారు. విశాఖ రాజసం కానీ రాజధాని హోదా కానీ ఎక్కడా తగ్గకుండా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్న భరోసా ఇస్తున్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు అమరావతి గురించి ఎక్కువగా చెబుతున్నారు. అమరావతి ప్రపంచ రాజధాని అవుతుందని కూడా ప్రకటిస్తున్నారు.

ఈ విధంగా చూస్తే కనుక చంద్రబాబు చినబాబు ఇద్దరూ అమరావతి టూ విశాఖను అభివృద్ధి బాటన నిలిపేందుకు తమదైన ప్లాన్స్ తో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. దాంతో విశాఖ జనాలు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఏది ఏమైనా అమరావతి విశాఖ రెండింటినీ కరెక్ట్ గా బాలెన్స్ చేసుకుంటూ బాబులిద్దరూ వెళ్తున్నారు అని అంతా అనుకుంటున్నారు.