Begin typing your search above and press return to search.

అట్లుంటది చంద్రబాబుతో.. పాస్టర్ ప్రవీణ్ కేసే ఒక ఉదాహరణ

అనుభవం పాఠాలు నేర్పుతుంది అంటారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కూడా గత అనుభవాలతో గుణపాఠం నేర్చుకుందని పాస్టర్ ప్రవీణ్ కేసుతో రుజువు చేసుకుంది.

By:  Tupaki Desk   |   13 April 2025 7:00 PM IST
అట్లుంటది చంద్రబాబుతో.. పాస్టర్ ప్రవీణ్ కేసే ఒక ఉదాహరణ
X

అనుభవం పాఠాలు నేర్పుతుంది అంటారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కూడా గత అనుభవాలతో గుణపాఠం నేర్చుకుందని పాస్టర్ ప్రవీణ్ కేసుతో రుజువు చేసుకుంది. 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాన్ని పట్టించుకునేవారు కాదు. ప్రజలు సోషల్ మీడియాను నమ్మరనే భ్రమలోనే ఎక్కువగా ఉండేవారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దాని ఫలితంగా ఓ సామాజికవర్గం వారికే డీఎస్పీ ప్రమోషన్లు, తిరుమలలో పింక్ డైమండ్ మాయమైందనే ప్రచారంతో మూల్యం చెల్లించుకున్నారు. 2019లో ఎన్నికల్లో సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారంతో నష్టపోయిన చంద్రబాబు.. తన 4.0 పాలనలో మళ్లీ ఆ తప్పు చేయడం లేదు. తన అనుభవంతో సోషల్ మీడియాను చక్కగా డీల్ చేస్తూ వ్యతిరేక ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడుతున్నారు. దీనికి పాస్టర్ ప్రవీణ్ కేసును పెద్ద ఉదాహరణగా చెబుతున్నారు.

గత నెల 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్న పాస్టర్ ప్రవీణ్ ప్రమాదవశాత్తూ మరణించారు. అయితే ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు కన్నా ముందే రంగంలోకి దిగిన సోషల్ మీడియా జనాలు పాస్టర్ ప్రవీణ్ ను ఎవరో హత్య చేశారంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీనికి మాజీ ఎంపీ హర్షకుమార్, వైసీపీ నేత బెన్ని లింగం వంటివారు తోడవ్వడంతో ప్రమాదం కాస్త అత్యంత సున్నితమైన అంశంగా మారిపోయింది. అసలు నిజం ఏంటో తెలుసుకోకుండానే క్రైస్తవ సంఘాలు ధర్నాలు చేయడం, మత కలహాలు చెలరేగేలా కొందరు విద్వేష ప్రసంగాలు చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. పాస్టర్ ప్రవీణ్ మరణం వెనుక మిస్టరీని ఛేదించాలని పోలీసులను ఆశ్రయించారు.

ఇక సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు సోషల్ మీడియా దాడిని సమర్థంగా ఎదుర్కొన్నారు. పాస్టర్ మరణంపై అనుమానం వ్యక్తం చేసిన వారందరికీ నోటీసులిచ్చి, ఆధారాలు ఇవ్వాలని అడగడంతో కెమెరాల ముందు రెచ్చిపోయిన వారంతా సైలెంట్ అయిపోయారు. తమకు తెలియదంటే తమకు తెలియదని వెనక్కి తగ్గారు. ఇదే సమయంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ చేరిన పోలీసులు.. పాస్టర్ ప్రవీణ్ ఇంటి దగ్గర నుంచి రాజమండ్రిలో ప్రమాదం జరిగిన వరకు దారిపొడవునా, సీసీ కెమెరాలను శోధించారు. దాదాపు 600 సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించిన పోలీసులు పాస్టర్ ప్రవీణ్ మరణం వెనుక మిస్టరీని ఛేదించారు. ఈ క్రమంలో సోషల్ మీడియాను ప్రభుత్వం అదుపు చేసిన విధానం చంద్రబాబు అనుభవానికి నిదర్శనంగా చెబుతున్నారు. గతంలో ఇదే అంశాలపై సోషల్ మీడియా ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు ప్రచారం చేసినా, పోలీసులు, ప్రభుత్వం చేష్టలుడిగి చూడాల్సివచ్చేదని అంటున్నారు. కానీ, ఇప్పుడు దెబ్బతిన్న పులిలా చంద్రబాబు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ముందే ఊహించి తిప్పికొడుతున్నారు.

ఈ కేసులో అత్యంత సున్నితమైన అంశం ముడిపడి ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారని చెబుతున్నారు. దర్యాప్తు జరుగుతున్న విధానంపై పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు లభించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రభుత్వ విచారణపై తమకు పూర్తి నమ్మకం ఉందని బాధిత కుటుంబం చెప్పడంతో సోషల్ మీడియా నోళ్లకు తాళం వేశారు. ఇదే సమయంలో చంద్రబాబు స్థానంలో వేరొకరు ఉంటే మరింత రచ్చ జరిగేదని అంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆచితూచి వ్యవహరిస్తున్నా, సోషల్ మీడియా ఊగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు అనుభవం పోలీసు ప్రతిష్టను పెంచిందని అంటున్నారు. మొత్తానికి 14 రోజుల అవిశ్రాంత దర్యాప్తులో పోలీసులకు భారీ విజయం దక్కేలా చంద్రబాబు మార్గనిర్దేశం వహించడమే గొప్ప విషయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.