మోడీ సొంత గడ్డ మీద బాబు ఏం చెప్పబోతున్నారు ?
నరేంద్ర మోడీ సొంత గడ్డ గుజరాత్ లో ఆయనతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనే అరుదైన సన్నివేశం ఇది.
By: Tupaki Desk | 16 Sep 2024 3:50 AM GMTనరేంద్ర మోడీ సొంత గడ్డ గుజరాత్ లో ఆయనతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనే అరుదైన సన్నివేశం ఇది. చంద్రబాబు మోడీ కలుసుకునేది గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో. అక్కడ నాలుగో గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో ఇద్దరు నేతలూ పాల్గొంటున్నారు.
ఈ సదస్సులో పాల్గొనాలని బాబుకు ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. ఇది ఏపీ సీఎం కి దక్కిన గౌరవం. ఈ సందర్భంగా మోడీ బాబు కలుసుకుంటున్నారు. ఇంతకాలం ఢిల్లీలోనే ఇద్దరూ నేతలూ భేటీలు వేసేవారు. ఇపుడు మోడీ సొంత స్టేట్ లో బాబు ఒక అతిథిగా వెళ్తున్నారు. అదే సమయంలో ఆయన ఎన్డీయే కూటమిలో కీలక మిత్రుడు. దాంతో బాబుకు మంచి ప్రాధాన్యత ఉంది. అయితే మోడీ బాబు కలుసుకునే ఈ సందర్భం అతి ముఖ్యమైనది.
ఎందుకంటే ఆ మధ్య ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానిని కలసినపుడు ఏపీకి సంబంధించిన అనేక విషయాలు చర్చించారు. నిధుల గురించి కోరారు. విభజన హామీల మీద మాట్లాడారు. ఆ విషయంలో ఏదైనా మేలు జరుగుతుందని భావిస్తున్న వేళ ఇంతలో అనూహ్యంగా ఏపీ మీద పెను తుఫాను పడగ విప్పింది.
ఏపీకి కీలకమైన నగరంగా రాజధాని ప్రాంతంగా ఉన్న విజయవాడ మొత్తం నీట మునిగింది. అంతే కాదు ఏపీలోని గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలు వరద తాకిడికి దారుణంగా దెబ్బ తిన్నాయి. ఈ నేపధ్యంలో ఏపీకి ఎంత అయినా ఆర్థిక సాయం కేంద్రం చేయాల్సి ఉంది.
అలాగే ఏపీని ఆదుకోవాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి వెళ్లారు. కేంద్ర బృందాలు కూడా ఏపీకి వచ్చాయి. ఆ నివెదికలను బట్టి కేంద్రం పెద్ద ఎత్తున సాయం అందిస్తుందని బాబు చాలా ఆశలే పెట్టుకున్నారు. మరి మోడీని అయితే ఆయన కలవలేదు.
ఇపుడు అనుకోని అవకాశం ఇది. ఇక ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య రాజకీయ రంగు తీసుకుంది. వైసీపీ ఈ విషయంలో ఫోకస్ పెట్టింది. టీడీపీ ని కార్నర్ చేస్తోంది. కేంద్రం మీద ఒత్తిడి పెట్టమని డిమాండ్ చేస్తోంది.
దాంతో టీడీపీకి ఇది ఇబ్బందికరంగా మారింది. దాంతో పాటు స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్లాక్ ఫర్నేస్ విభాగాన్ని తొలిసారి మూసివేశారు. ఇది ప్లాంట్ మూసివేతకు ముందు చేస్తున్న కుట్ర అని కార్మిక లోకం మండిపోతోంది.
ఈ మొత్తం పరిణామాలను చూస్తే కనుక విశాఖ ఉక్కు మీద ఉపశమనం ఇచ్చే ప్రకటన కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఆ దిశగా బాబు కేంద్రంతో మాట్లాడాల్సి ఉంది. మరి మోడీతో ఇపుడు భేటీకు అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు ఏమి చెప్పబోతున్నారు అన్నదే అందరిలోనూ ఆసక్తి ఉంది.
అయితే ఈ సదస్సు తరువాత మోడీతో బాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారని అంటున్నారు. అదే సమయంలో ఆయన రాష్ట్రంలో వరదల గురించి ప్రధానిని వివరించి జరిగిన నష్టాన్ని ఆయన దృష్టిలో పెడతారు అని అంటున్నారు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కూడా బాబు మోడీ చెవిన వేసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్రేకులు వేయిస్తారా అన్నదే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విషయం.