2025లో 1995...బాబు తలచుకుంటే !
అంతే కాదు తాను తగ్గేదేలే అని స్పష్టమైన సంకేతాలను ఇచ్చేశారు. నేను మళ్ళీ 1995 నాటి సీఎం గా కనిపిస్తాను అంటూ హెచ్చరించారు.
By: Tupaki Desk | 2 Jan 2025 4:01 AM GMTటీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తలచుకోవాలే కానీ ఏమైనా చేయగలరు ఆయన కాలాన్ని వెనక్కి తిప్పగలరు కూడా. అందుకే బాబు నాలుగవసారి ఏడున్నర పదుల వయసులో సీఎం అయినా కూడా తన వయసు పాతికేళ్ళే అంటున్నారు. తన ఆలోచనలతో మీట్ అయ్యేవారు మ్యాచ్ చేసేవారూ ఎవరూ లేరని కూడా చాటుకుంటున్నారు.
ఇక కొత్త ఏడాది 2025 తొలిరోజున బాబు మీడియాతో మాట్లాడుతూ హుషార్ ని ఇచ్చే మాటలు చాలా చెప్పారు. అంతే కాదు తాను తగ్గేదేలే అని స్పష్టమైన సంకేతాలను ఇచ్చేశారు. నేను మళ్ళీ 1995 నాటి సీఎం గా కనిపిస్తాను అంటూ హెచ్చరించారు.
తాను దూకుడు చేయడం మొదలెడితే అక్రమార్కులు తట్టుకోలేరు అని కూడా అన్నారు. తాను తప్పు చేసిన వారిని ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అది తన వారు అయినా బయట వారు అయినా ఒక్కటే నీతి అని క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగబోమని అదే సమయంలో తప్పు జరిగితే మాత్రం శిక్షలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
ఇక సీకీ నుంచి ఏపీ ప్రభుత్వం జగన్ టైం లో విద్యుత్ ని కొనుగోలు చేసింది. ఇందులో ముడుపులు వైసీపీ పెద్దలకు ముట్టాయి అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీని మీద కూడా ఆయన మాట్లాడుతూ సెకీకి సంబంధించి పూర్తి రికార్డు ఇంకా రాలేదని అమెరికా నుంచి ఆ నివేదిక రాగానే దానిని స్టడీ చేసి తదుపరి చర్యలకు దిగుతామని అన్నారు.
అంటే జగన్ విషయంలో 2025లో భారీ యాక్షన్ ప్లాన్ ఉందని చెప్పకనే చెప్పేశారు అన్న మాట. మరో వైపు చూస్తే ప్రజల ఆలోచనల మేరకు పాలనా విధానాలను మార్చుకుంటామని కూడా బాబు చెప్పారు. అయితే పాలనను గాడిలో పెట్టడానికి 1995 సీఎం అవసరం అన్నట్లుగా బాబు మాట్లాడుతున్నారు.
అప్పట్లో బాబు వయసు 45 ఏళ్ళు. ఆయన చాలా దూకుడుగా ఉండేవారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ పాలనా యంత్రాంగంలో కొత్త మార్పులు తెచ్చారు. రెడ్ టేపిజాన్ని ఆయన అంతం చేశారు. పరిపాలన చాలా జోరందుకునేలా చేశారు. అధికారులు ఉద్యోగులు అంతా ఠంచనుగా కార్యాలయాలకు వచ్చేవారు. ప్రజల సమస్యలు ప్రభుత్వ ఆఫీసులలో చాలా స్పీడ్ గా పరిష్కారం అయ్యేవి.
ఇక అవినీతి విషయంలోనూ రాజీ లేదని నాడు బాబు పాలన రుజువు చేసింది. అనేక సంస్కరణలకు కూడా బాబు 1995లో శ్రీకారం చుట్టారు. నిజంగా బాబు యంగ్ అండ్ డైనమిక్ సీఎం గా నాడు పేరు తెచ్చుకున్నారు. మళ్లీ ఆనాటి సీఎం ని అవుతాను అని బాబు అంటున్నారు. అది మంచిదే అని ప్రజలు అంటున్నారు. కానీ ఇపుడున్న పరిస్థితులలో అది సాధ్యమా అని కూడా ఆలోచిస్తున్నారు. ఎందుచేతంటే బాబు అలా చేయడం వల్ల ఉద్యోగ వర్గాలు దూరం అయ్యాయి.
దాంతో 2004లో ఓటమి ఎదురైంది. దాంతో బాబు తన వర్కింగ్ స్టైల్ ని పూర్తిగా మార్చుకున్నారు. ఇపుడు 2025లో 1995 అని అంటున్నారు. అంటే మూడు దశాబ్దాల వెనక్కి వెళ్లడం అన్న మాట. అది జరిగే పనేనా అంటే అక్కడ ఉన్నది బాబు తప్పకుండా జరిగి తీరుతుందని అంటున్నారు.
అదే విధంగా సూపర్ సిక్స్ హామీలను తుచ తప్పకుండా అమలు చేస్తామని బాబు చెబుతున్నారు. కాస్తా ముందూ వెనకా అవవచ్చు కానీ బాబు ఈసారి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా 2029 ఎన్నికలకు వెళ్లరు అని అంటున్నారు. ఎందుకంటే జగన్ కి ఏ మాత్రం చాన్స్ ఇచ్చేందుకు బాబు సిద్ధంగా లేరు అని అంటున్నారు. ఒక వైపు ఏపీకి అమరావతి రాజధానిని రూపు రేఖలు తీసుకుని రావడం పోలవరం పూర్తితో పాటు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తే కనుక బాబుకు 2029లో తిరుగు ఉండదని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.