మోడీ నుంచి నేర్చుకున్న పాఠాన్ని రివీల్ చేసిన చంద్రబాబు
గతంలో ముఖ్యమంత్రిగా పలుమార్లు పని చేసిన చంద్రబాబుకు.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయ్యాక ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది
By: Tupaki Desk | 7 March 2025 11:36 AM ISTగతంలో ముఖ్యమంత్రిగా పలుమార్లు పని చేసిన చంద్రబాబుకు.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయ్యాక ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో సీరియస్ గా ఉండటం.. చతురతకు అవకాశం ఇవ్వకుండా ఉండటంతో పాటు.. తాను చేసిన తప్పుల్ని ఒప్పుకునే గుణం ఉండేది కాదు. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా తనను ఉద్దేశించి చేసే విమర్శల్ని గుర్తిస్తున్నారు. తనను తాను గొప్పగా చెప్పుకునే పాత చంద్రబాబుకు.. ఇప్పటి చంద్రబాబుకు కాస్త తేడా ఉంది.
ఎదుటివారిలోని గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు. దాని గురించి మాట్లాడుతున్నారు. తాను నేర్చుకున్న పాఠాల్ని బయటకు చెప్పేందుకు సంకోచించటం లేదు. మొత్తంగా చంద్రబాబులో మారిన మనిషి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాడు. తాజాగా రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ప్లీనరీలో ‘లిమిట్ లెస్ ఇండియా’ అనే అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికర అంశాన్ని షేర్ చేశారు.
మంచి పనులు చేయటంతో పాటు ప్రజలు మనవైపు ఉండేలా చూసుకోవటం చాలా ముఖ్యమని.. డెవలప్ మెంట్ మీద ఫోకస్ చేసి.. చేసే పని గురించి ప్రజలకు సరిగా చెప్పకపోతే.. ఎన్నికల్లో వారు ఓట్లు వేయకపోవచ్చన్న ఆసక్తికర విషయాన్ని చంద్రబాబు వెల్లడించారు. 2004, 2019లలో తాను డెవలప్ మెంట్ పనుల్లో మునిగిపోవటం వల్ల తాను ఓడిపోయానే తప్పించి.. ప్రతిపక్షాలు తనను ఓడించలేదన్నారు. ఈ విషయంలో తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందిస్తున్నట్లు చెప్పారు.
మోడీ తాను అనుకున్న పనుల్ని చేయటమే కాదు.. స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నారని.. ఇదెన్నో సమస్యల్ని పరిష్కరించినట్లుగా చెప్పారు. ‘ఎన్నికల్లో ఓడిపోకూడదన్న పాఠాన్ని నేను ప్రదానమంత్రి నరేంద్ర మోడీ నుంచి నేర్చుకున్నా’ అంటూ తన మనసులోని మాటల్ని చెప్పుకొచ్చారు. భారత్ కు భవిష్యత్తులో హద్దులు ఉండవని తాను భావిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు.. మోడీ నాయకత్వంలో భారత్ 2047 నాటికి ఒకట్రెండు స్థానాలకు చేరుకుంటుందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు నంబర్ వన్ స్థానంలో ఉంటారన్నచంద్రబాబు.. ‘ఈ రోజు నేను చెప్పిన మాటల్ని రాసి పెట్టుకోండి. ప్రస్తుతం మనమంతా యూదుల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వారు అత్యంత ప్రభావం చూపే స్థితిలో ఉన్నారు. కానీ.. ఇప్పుడు ప్రపంచంలోని ఏ సంపన్న నివాస ప్రాంతాలకు వెళ్లి చూసినా అది భారతీయులదే అవుతుందని గర్వంగా చెప్పగలను. అమెరికాలోని భారతీయుల సగటు ఆదాయం ఇక్కడున్న మిగిలిన దేశాల వారి కంటే రెట్టింపు’’ అంటూ ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.