చంద్రబాబును కలవడానికే ఇష్టపడని బిల్ గేట్స్.. ఇంట్రస్టింగ్ స్టోరీ
ఇప్పుడంటే చంద్రబాబుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. దేశంలోనే గొప్ప పొలిటీషియన్ గా పేరుంది. కానీ తొలి నాళ్లలో అలాంటిది ఏమీ లేదు
By: Tupaki Desk | 28 March 2025 9:47 AMఇప్పుడంటే చంద్రబాబుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. దేశంలోనే గొప్ప పొలిటీషియన్ గా పేరుంది. కానీ తొలి నాళ్లలో అలాంటిది ఏమీ లేదు. ఆయన కలల సాధనకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మద్రాస్ ఐఐటీలో విద్యార్థులతో కొన్ని నిజాలు చెప్పుకున్నాడు. ‘తాను కలుస్తానని మొదటిసారి కోరినప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇష్టపడలేదని సీఎం చంద్రబాబు పేర్కొనడం ఆసక్తి రేపింది. రాజకీయ నాయకులతో తనకు పనిలేదని బిల్ గేట్స్ తిరస్కరించాడట.. బాబు ఎలా ఒప్పించాడు? ఎలా మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడన్న ఆసక్తికర స్టోరీని మద్రాస్ ఐఐటీ విద్యార్థులతో చంద్రబాబు చెప్పుకున్నాడు.
ప్రస్తుత ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందని, భవిష్యత్తు అంతా భారతీయులదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మద్రాస్ ఐఐటీలో జరిగిన ‘ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మద్రాస్ ఐఐటీ అనేక విషయాల్లో అగ్రస్థానంలో ఉందని కొనియాడారు. ఆన్‌లైన్ కోర్సులు అందించడంలోనూ, స్టార్టప్‌లను ప్రోత్సహించడంలోనూ ఐఐటీ మద్రాస్ ముందుందన్నారు. ఇక్కడి స్టార్టప్ ‘అగ్నికుల్’ మంచి విజయాలు సాధించిందని, దాదాపు 80 శాతం స్టార్టప్‌లు విజయవంతంగా నడుస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ఐఐటీలో దాదాపు 35 నుంచి 40 శాతం తెలుగు విద్యార్థులు ఉండటం గర్వకారణమన్నారు.
దేశ విద్యారంగంలో ఐఐటీల స్థాపన ఒక గొప్ప ముందడుగు అని చంద్రబాబు అభివర్ణించారు. 1991లో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయని ఆయన అన్నారు. ఆ సంస్కరణలు అప్పట్లో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయమని ఆయన గుర్తు చేశారు. రాజకీయ సంస్కరణల వల్ల సోవియట్ రష్యా అనేక దేశాలుగా విడిపోయిందని, అదే సమయంలో చైనా ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆయన ఉదాహరించారు. భారతదేశం కూడా సంస్కరణల తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో తన తొలి సమావేశం గురించి కూడా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మొదట కలవడానికి అడిగినప్పుడు రాజకీయ నాయకులతో సంబంధం లేదని చెప్పినా, ఆయనను ఒప్పించి అపాయింట్‌మెంట్ తీసుకున్నానని ఆయన తెలిపారు. ఆ సమావేశంలో 45 నిమిషాలు మాట్లాడారని, హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సంస్థను నెలకొల్పాలని కోరానని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ సంస్థకు తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల సీఈవోగా ఉండటం గర్వకారణమన్నారు.
బ్రిటీష్ వారు మన దేశం నుండి అన్నింటినీ తీసుకెళ్లారని, కానీ ఆంగ్ల భాషను మాత్రం వదిలి వెళ్లారని చంద్రబాబు అన్నారు. 1990లలో కమ్యూనికేషన్ రంగంలో బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ గుత్తాధిపత్యం ఉండేదని, ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేట్ సంస్థల రాకతో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఆయన తెలిపారు.
గత కొంతకాలంగా భారతదేశ వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని చంద్రబాబు అన్నారు. 2014లో పదో స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుందని ఆయన తెలిపారు. భారతదేశానికి ఉన్న గొప్ప వరం జనాభా అని, ఇది డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని ఆయన అన్నారు. మనమందరం కలిసి కృషి చేస్తే త్వరలోనే భారత్ ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక దేశాలు జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్నాయని, కానీ భారతదేశానికి మరో 40 ఏళ్ల వరకు ఆ సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగానికి మద్రాస్ ఐఐటీ విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఆయన ప్రస్తావన వచ్చినప్పుడల్లా విద్యార్థులు కేరింతలు, చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు.