మంత్రులకు క్లాస్ పీకిన చంద్రబాబు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు?
ఇప్పుడే కాదు ఎప్పుడూ ఒకేలాంటి తీరు ప్రదర్శించే తెలుగు తమ్ముళ్ల విషయంలో తొలిసారి చంద్రబాబు క్లాస్ పీకారు.
By: Tupaki Desk | 24 Oct 2024 4:54 AM GMTఇప్పుడే కాదు ఎప్పుడూ ఒకేలాంటి తీరు ప్రదర్శించే తెలుగు తమ్ముళ్ల విషయంలో తొలిసారి చంద్రబాబు క్లాస్ పీకారు. అధికారంలో ఉన్న ప్రతిసారీ.. పదవులతో ఎంజాయ్ చేసే మంత్రులు.. తమ ముఖ్యమంత్రి మీదా.. పార్టీ మీదా విపక్షాలు విరుచుకుపడితే వారికి ఘాటుగా కౌంటర్లు ఇచ్చే విషయంలో తెలుగుదేశం మంత్రులు వెనుకగానే ఉంటారు. అంతా అధినేతే చూస్తారన్నట్లుగా వ్యవహరించే ధోరణి ఎక్కువ. విచిత్రంగా చంద్రబాబు సైతం మొత్తం తన మీదే వేసుకుంటారే తప్పించి.. మంత్రులను ప్రశ్నించటం కనిపించదు. ఈ లోపం ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ తాజాగా మాత్రం కాస్త భిన్నంగా రియాక్టు అయ్యారు చంద్రబాబు.
తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ సహచరులకు కీలక సూచనలు చేశారు. అదే సమయంలో క్లాస్ పీకారని చెప్పాలి. ఏదైనా ఘటన చోటుచేసుకున్నప్పుడు ఇన్ ఛార్జి.. స్థానిక మంత్రులు వెంటనే స్పందించాలని.. ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా మంత్రులు ప్రచారం చేసుకోకపోవటాన్ని ప్రశ్నించారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించి 15 రోజులు అవుతున్నా.. ప్రజలకు ఆ విషయాన్ని సరిగా చెప్పలేకపోతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ క్లాస్ పీకారు.
నిజమే.. ప్రభుత్వం చేపట్టే చర్యలు.. కొత్త పాలసీల గురించి ప్రజలకు చెప్పటంతో పాటు.. విపక్షాలు చేసే విమర్శలకు ఘాటుగా రియాక్టు కావాల్సి వస్తుంది. జగన్ ప్రభుత్వంలో చూస్తే.. తక్కువలో తక్కువ అరడజను మంది మంత్రులు ప్రభుత్వ విధానాలపైనా.. అధినేత మీద ఈగ వాలినా ఒప్పుకోమన్నట్లుగా వ్యవహరిస్తారు. వీరే కాక.. మరో అరడజను మంది నేతలు ప్రభుత్వానికి తమ మాటలతో కావలి కాస్తుంటారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి ప్రభుత్వంలో మాత్రం అలాంటిదేమీ కనిపించదు. ఆ మాటకు వస్తే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపక్షాలపై విరుచుకుపడిన మంత్రుల పేర్లు నోటి మీద చెప్పేయొచ్చే తప్పించి.. సీరియస్ గా తమ అధినేతకు దన్నుగా నిలిచేలా వ్యవహరించే తీరుఅస్సలు కనిపించదనే చెప్పాలి. పదవులు ఇచ్చినా.. పట్టనట్లు వ్యవహరించే నేతలపై చంద్రబాబు ఎందుకు సీరియస్ కారన్న సందేహం మొదట్నించి ఉండేది. తాజా పరిణామాన్ని చూస్తే.. ఆ లోటు తీరిందనే చెప్పాలి. ఇసుక విధానం.. విజయనగరం జిల్లాలో డయేరియాలాంటి ఘటనలపై స్థానికంగా ఉన్న మంత్రులు వెంటనే స్పందించి ఉండాలి కదా? అంటూ ప్రశ్నించిన వైనం చూస్తే.. చంద్రబాబు గతంలో మాదిరి చూస్తూ ఉండకుండా.. తన మంత్రివర్గ సహచరులు సైతం చురుగ్గా ఉండాలన్న మైండ్ సెట్ లోకి వచ్చారని చెప్పాలి. ఇదో మంచి మార్పుగా చెప్పక తప్పదు.