దావోస్ రిజల్ట్ : పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన బాబు
ఏపీ లాంటి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించాలని అతి పెద్ద లక్ష్యంతో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫారం కి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళారు
By: Tupaki Desk | 24 Jan 2025 4:15 AM GMTఏపీ లాంటి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించాలని అతి పెద్ద లక్ష్యంతో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫారం కి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళారు. ఆయన బృందంలో యంగ్ టీం ఉంది. ఐటీ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ఉన్నారు.
ఇదిలా ఉంటే నాలుగు రోజుల పాటు దావోస్ లో పర్యటించిన చంద్రబాబు అక్కడ అంతర్జాతీయ ప్రముఖులతో భేటీ అయ్యారు. బిలిగేట్స్ తో భేటీ వేసారు. ఐటీ దిగ్గజ సంస్థల పెద్దలనూ కలిసారు. వీలైనంత వరకూ ఏపీలో ఉన్న వనరుల గురించి ప్రమోట్ చేశారు. అమరావతి రాజధానిలో అనుకూల అంశాలు, మెగా సిటీ విశాఖలో ఐటీ పరంగా విస్తరణకు గల మార్గాలు అన్నీ కూడా బాబు వివరించారు. నారా లోకేష్ కూడా ఈసారి కీలక పాత్ర పోషించారు.
అయితే ఏపీలో రాజధాని నగరం ఇంకా రూపు దిద్దుకోవాల్సి ఉంది. విశాఖ మహా నగరంగా ఉన్నా మిగిలిన రాష్ట్రాలలో ఉన్న మెగా సిటీస్ తో పోటీ తట్టుకోవాల్సి ఉంది. అందుకే దావోస్ టూర్ లో ఏపీ ప్రభుత్వం చేసిన కృషి అయితే పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసింది కానీ ఒప్పందాలు అయితే పెద్దగా గ్రౌండింగ్ కాలేదు అన్నది ఉంది.
అయితే అందరినీ ఆకట్టుకోవడంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు సక్సెస్ అయ్యారు అనే చెప్పాల్సి ఉంది. మరో వైపు తెలంగాణాకు ఒక లక్షా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయీ అంటే హైదరాబాద్ విశ్వనగరంగా ఉండడం వల్లనే అని అంటున్నారు.
ఇది పోటీ ప్రపంచం. ఎంత అనుకున్నా ఎంతలా ప్రమోట్ చేసినా ఏపీలో ఉన్నవి అన్నీ టైర్ టూ సిటీసే. దాంతో పాటు బేసికల్ గా ఏపీ అగ్రికల్చర్ స్టేట్ గా ఉంది. దానిని పారిశ్రామికంగా పరుగులు పెట్టించే దశలో ఇపుడు మొదటి అడుగుల వద్దనే కధ సాగుతోంది.
దాంతో ఏపీకి పెట్టుబడులు పెద్దగా రావడం లేదు అంటే ఈ నేపథ్యాన్ని కూడా ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఏపీ పట్ల మోజు పెరగాలీ అంటే రాజధానిగా అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేసుకోవడం, అదే సమయంలో విశాఖతో పాటుగా ఇతర నగరాలను మహా నగరాలుగా తీర్చి దిద్దడం వంటివి చేయాలి.
అపుడు దావోస్ కి ప్రత్యేకంగా వెళ్ళాల్సిన పని ఉండదు, అక్కడి వారే వెతుక్కుంటూ వస్తారని చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఏపీ మరింతగా ముందుకు సాగాలీ అంటే పాలకులతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యంతో పనిచేయాల్సి ఉంటుంది. ఏపీని అంతా కలసి అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. దావోస్ సాక్షిగా మరో మారు ఇదే విషయం ఆవిష్కృతమైంది.