ఢిల్లీలో బాబు ఫుల్ బిజీ!
ఇక ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశానికి బాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో బాబు హైలెట్ గా నిలిచారు.
By: Tupaki Desk | 25 Dec 2024 2:44 PM GMTముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఫుల్ బిజీ అయిపోయారు. ఆయన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కీలక మంత్రులతో బీజేపీ పెద్దలతో భేటీలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో బాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏకంగా గంట సేపు భేటీ వేసి పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని విషయంలో కేంద్రం పూర్తి సహకారం అందించాలని ఆయన ప్రధానిని కోరారని అంటున్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో పేర్కొన్న విధంగా 15 వేల కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని సాధ్యమైనంత వేగంగా అందించాలని మోడీని బాబు కోరినట్లుగా చెబుతున్నారు. మరో వైపు చూస్తే పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ప్రధాని దృష్టికి బాబు తెచ్చారని అంటున్నారు. ఏపీకి జీవనాడి లాంటి పోలవరానికి అవసరమైన నిధులను విడుదల చేసి ప్రాజెక్ట్ పరిపూర్తికి సహకరించాలని బాబు కోరారని సమాచారం. అంతేకాదు ఏపీలో అనేక కీలక ప్రాజెక్టుల విషయాలను కూడా మోడీకి బాబు వివరించినట్లుగా తెలుస్తోంది. జనవరి 8న ఏపీకి ప్రధాని రావాలని అనుకుంటున్నారు.
ఈ మేరకు ఆయన అధికారిక పర్యటన ఖరారు అయింది. ఈ నేపధ్యంలో ప్రధానిని ఏపీకి బాబు స్వయంగా కలసి ఆహ్వానించారు. ఇక ఇదే టూర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ బాబు భేటీ అవుతారని తెలుస్తోంది. దీని కంటే ముందు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోనూ బాబు సమావేశం అయి ఏపీకి సంబంధించిన పలు రైవే ప్రాజెక్టుల గురించి చర్చించారు.
ఇక ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశానికి బాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో బాబు హైలెట్ గా నిలిచారు. నడ్డాకు ఒక వైపు అమిత్ షా కూర్చుంటే మరో వైపు బాబు కూర్చున్నారు. ఎన్డీయేలో బీజేపీ తరువాత అతి పెద్ద పార్టీగా టీడీపీ ఉంది.
దాంతో టీడీపీకి ఎన్డీయే ఇస్తున్న ప్రాధాన్యతగా దీనిని చూస్తున్నారు. బాబుకు ఎన్డీయేలో దక్కుతున్న ఈ ప్రయారిటీతో ఏపీకి మేలు జరుగుతుందని అంటున్నారు. ఇక జమిలి ఎన్నికల బిల్లు, వక్ఫ్ బోర్డు బిల్లు జేపీసీకి నివేదించిన నేపధ్యంలో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధానంగా వీటి మీదనే చర్చించారు అని అంటున్నారు. అంతే కాకుండా 2025 లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ అలాగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల విషయం చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇక పార్లమెంట్ హౌస్ లో మరింత కలసికట్టుగా ఎన్డీయే పక్షాలు ఉండాలని విపక్షాల విమర్శలు తిప్పికొట్టాలని కూడా ఎన్డీయే భేటీలో చర్చించారని అంటున్నారు. మోడీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చాక వరసగా ప్రతీ నెలా ఎన్డీయే సమావేశాన్ని నిర్వహించాలని ఎన్డీయే మిత్రుల మధ్య సామరస్య వాతావరణం ఉండాలని భావిస్తూ ఈ విధంగా షెడ్యూల్ చేశారు.
దాంతో గత నెలలో హర్యానాలో జరిగిన ఎన్డీయే మీట్ తరువాత ఇపుడు ఢిల్లీలో నిర్వహించారు. ఈ భేటీకి ఎన్డీయే మిత్ర పక్షాలు అన్నీ హాజరయ్యాయి. మొత్తం మీద చూస్తే ఎన్డీయేలో బాబు ప్రాధాన్యత బాగా పెరుగుతోంది అనడానికి ఆయన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులతో భేటీలు వారి నుంచి వస్తున్న సానుకూల స్పందనలు తెలియచేస్తున్నాయని అంటున్నారు.