Begin typing your search above and press return to search.

అభిమాని చివరి కోరిక తీర్చటం కోసం చంద్రబాబు ఏం చేశారంటే?

గతంతో పోలిస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   6 Oct 2024 4:31 AM GMT
అభిమాని చివరి కోరిక తీర్చటం కోసం చంద్రబాబు ఏం చేశారంటే?
X

గతంతో పోలిస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తనను అభిమానించే వారి కోసం.. వారి వినతుల్ని వెంటనే పరిష్కరిస్తున్నారు. వారి కోసం తపిస్తున్నారు. తాజాగా అలాంటి పని మరొకటి చేశారు చంద్రబాబు. క్యాన్సర్ తో పోరాడుతూ చివరి ఘడియల్లో ఉన్న ఒక అభిమానికి.. తన జీవితంలో ఒక్కసారి అయినా చంద్రబాబుతో కలిసి ఫోటో దిగాలన్న కోరికను తీర్చేందుకు డిసైడ్ అయ్యారు. చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన 30 ఏళ్ల సురేంద్రబాబుకు చంద్రబాబు అంటే ప్రాణం. ఆయనతో ఒక్కసారైనా ఫోటో దిగాలన్నది కోరిక.

దివ్యాంగుడైన అతని ఆఖరి కోరిక గురించి అతడి సంబంధికులు స్థానిక నేతల ద్వారా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి తెలియజేశారు. తాజాగా తిరుమల దర్శనం కోసం వచ్చిన చంద్రబాబుకు సురేంద్రబాబు గురించి చెప్పారు. తిరుమల పర్యటనను ముగించుకొని రేణిగుంట విమానాశ్రయం గేటు వద్దకు వచ్చిన చంద్రబాబు.. వాహనం దిగి నడుచుకుంటూ సురేంద్రబాబు వద్దకు వెళ్లారు.

తానెంతో అభిమానించి.. ఆరాధించే సీఎం చంద్రబాబే స్వయంగా తన వద్దకు నడుచుకుంటూ వస్తున్న వైనంతో సురేంద్ర బాబు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అతడి తల్లిదండ్రులు ఆనందంతో తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. సురేంద్ర బాబు కోరుకున్నట్లే అతడితో పోటో దిగటంద్వారా అతడి కోరికను తీర్చిన చంద్రబాబు.. అతడి చికిత్స కోసం రూ.5 లక్షల చెక్ ను అందించారు. అంతేకాదు.. అతనికి ఏ అవసరం ఉన్నా తన వద్దకు తీసుకురావాలంటూ స్థానిక నేతలకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు స్పందనతో సురేంద్రబాబు.. అతడి కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోయారు.