పాపాల భైరవుడు జగనే !
మరో రెండు రోజులలో మూడు నెలల పాలనను పూర్తి చేసుకోబోతోంది టీడీపీ కూటమి ప్రభుత్వం.
By: Tupaki Desk | 9 Sep 2024 2:21 PM GMTఅవును సకల పాపాలకూ జగనే కారణం. జగన్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసి ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలు అయ్యాక కూడా జగన్ పేరునే బాగా వాడుకుంటోంది. మరో రెండు రోజులలో మూడు నెలల పాలనను పూర్తి చేసుకోబోతోంది టీడీపీ కూటమి ప్రభుత్వం. అంతే కాదు, వంద రోజులను కూడా సర్కార్ పూర్తి చేస్తోంది.
అయితే ప్రతీ దానికీ జగనే కారణం అంటూ చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఒకే మాట చెబుతున్నారు. ఏది లేకపోయినా జగనే కారణం. ఏది కాకపోయినా జగనే కారణం అంటున్నారు. విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ లో ప్రమాదం జరిగి 19 మంది చనిపోతే దానికి జగనే కారకుడు అని ఆరోపించిన కూటమి పెద్దలు తాజాగా బుడమేరు పొంగి బెజవాడ మునిగిపోతే దానికి జగనే కారణం అంటున్నారు
ఇక దీనితో పాటు లేటెస్ట్ గా చంద్రబాబు మరో మాట అంటున్నారు. ఏపీలో అప్పులు పుట్టకపోవడానికి జగనే కారణం అని అంటున్నారు. నిజానికి 2019లో ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యాక నాటి ఆర్ధిక మంత్రి యనమల రామక్రిష్ణుడు ఖజానాలో కేవలం 150 కోట్ల రూపాయలే ఉన్నాయని చెప్పారు. మేము మొత్తం ఎక్కడెక్కడ అప్పులు చేయాలో చేసేశాం, ఇక వైసీపీ ప్రభుత్వానికి అప్పు పుట్టదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా ఇపుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు.
కానీ జగన్ అయిదేళ్ల పాలనను అప్పులు తెచ్చే నడిపించారు. ఆయన ఎలా తెచ్చారు అంటే కేంద్రంలోని బీజేపీ సాయంతో అనే చెప్పాలి. ఇక ఇపుడు పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు ఏపీకి ఉందని చెబుతున్న చంద్రబాబు అండ్ కో ఆ అప్పులో తమ వాటా అంటే 2014 నుంచి 2019 దాకా ఎంతో ఉందో మాత్రం చెప్పడం లేదు అని అంటున్నారు. ఆ అయిదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రభుత్వం కూడా రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది అన్నది వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. దాని కంటే ముందు ఏపీ విభజనతోనే 90 వేల కోట్ల అప్పుతో ఆవిర్భవించింది అని అంటున్నారు.
ఆ విధంగా చూస్తే జగన్ ప్రభుత్వం చేసిన నికరమైన అప్పు ఆరు లక్షల కోట్లకు మించదని అంటున్నారు. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా ఇరవై వేల కోట్ల దాకా అప్పులు తెచ్చిన సంగతి జనాలకు తెలియదు అని అనుకున్నారో ఏమో కానీ వరద బాధితుల సాక్షిగా బాబు గారు ఏపీకి అప్పులు పుట్టడం లేదని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
ఏపీకి అప్పులు పుట్టకపోతే ఈ మూడు నెలలూ ఎలా గడచిందో ఆయనే చెప్పాలని కూడా అంతా అంటున్న పరిస్థితి. ఈ మూడు నెలలలో ఏపీకి సంపద ఏమైనా కొత్తగా పుట్టలేదు కదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరో వైపు చూస్తే ఏపీకి అప్పు పుట్టలేదు అని చెబుతున్న టీడీపీ పెద్దలు పోలవరానికి పదిహేను వేల కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ అప్పు ఎలా పుట్టిందో కూడా చెబితే బాగుంటుంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే బీజేపీతో అధికారికంగా ఏ విధమైన పొత్తు లేని వైసీపీ భారీగా అప్పులు తెచ్చుకుంటే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ అప్పులు తెచ్చుకోలేదా అని సందేహించే వారూ ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రతీ దానికీ జగనే కారణం అని బాబు అండ్ కో నిందించడం ఎంత వరకూ సమంజసం అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఎందుకంటే జగన్ అయిదేళ్ళ పాటు అధ్వాన్నమైన పాలన చేశారు అనే కదా జనాలు ఆయనను ఓడించి విజనరీ అయిన బాబుని ఎన్నుకున్నది అని కూడా గుర్తు చేస్తున్నారు ఏపీకి సంపద సృష్టించి అన్నీ అమలు చేస్తామని చెప్పిన బాబు మూడు నెలలు అయింది సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడడంలేదని గుర్తు చేస్తున్నారు. ఇక వివిధ శాఖల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేసి అందులో కూడా ప్రతీ దానికీ జగనే కారణం అని నిందించిన చంద్రబాబు జగన్ నామస్మరణలోనే తరిస్తారా తనదైన పాలన చూపిస్తారా అని జనాల నుంచి వస్తున్న ప్రశ్నలు.
ఒక ప్రభుత్వం బాగా లేదనే జనాలు పక్కన పెడతారు. కొత్త ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్ముతారు. కానీ పాత ప్రభుత్వాన్ని తిడుతూ కూర్చోమని కాదు, ఏది ఏమైనా చంద్రబాబు అనుభవం మీద ఆయన సంపద సృష్టించే నైపుణ్యం మీద విశ్వాసం ఉంచి జనాలు ఓటేశారు తప్ప జగన్ అన్నీ లేకుండా చేశారు, నేనేమి చేస్తాను బేలగా మాట్లాడానికి కాదని అంటున్నారు. మరి చంద్రబాబు ఇకనైనా ఈ రకమైన ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టి అసలైన పాలనకు తెర తీస్తారనే అంతా ఎదురుచూస్తున్నారు.