Begin typing your search above and press return to search.

తొలిసారి సీఎం అయ్యేనాటికి...ఇప్పటికీ బాబులో భారీ తేడా

నారా చంద్రబాబు నాయుడు అన్న పేరు ఏపీ ప్రజలకు పరిచయం అయింది 1981 ప్రాంతంలోనే.

By:  Tupaki Desk   |   1 Sep 2024 1:30 PM GMT
తొలిసారి సీఎం అయ్యేనాటికి...ఇప్పటికీ బాబులో భారీ తేడా
X

నారా చంద్రబాబు నాయుడు అన్న పేరు ఏపీ ప్రజలకు పరిచయం అయింది 1981 ప్రాంతంలోనే. అప్పటికి పాపులర్ నటుడుగా ఉంటూ నంబర్ వన్ గా టాలీవుడ్ ని ఏలుతున్న ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకోవడంతో ఆయన పేరు ఆయన అభిమానం జనానికి సాదర జనానికీ తెలిసింది.

చంద్రబాబు టీడీపీలోకి వచ్చాక కూడా తెర చాటుగానే ఉన్నారు. ఆయన్ 1985 ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా మొత్తం పార్టీ వ్యవహారాలను చక్కబెడుతూ వచ్చారు. ఆయన 1989లో కుప్పం నుంచి పోటీ చేసి గెలిచారు. దాంతోనే ఆయన మీడియాకు ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు 1991 ప్రాంతంలో ఎన్టీఆర్ అసెంబ్లీకి గుడ్ బై చెప్పడంతో బాబుకు బాధ్యతలు మరింత పెరిగాయి. అలా అసెంబ్లీలోనూ ఆయన మాట్లాడేవారు.

ఇక 1994లో టీడీపీ అధికారంలోకి వచ్చాక బాబుకు ఎన్టీఆర్ రెండు కీలక శాఖలు ఇచ్చారు. ఒకటి ఆర్ధిక రెండు రెవెన్యూ. అలా ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా ఒక బడ్జెట్ ని బాబు ప్రవేశపెట్టారు. 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు అనూహ్యమైన పరిస్థితుల్లో సీఎం అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి పెద్దగా మాట్లాడేవారు కాదు. బహిరంగ సభలలో పొడి పొడి మాటలతోనే సరిపుచ్చేవారు.

అలాంటి బాబు టీడీపీ అధినేతగా, అలాగే సీఎం గా ఎలా నిభాయించుకుని వస్తారు అన్న చర్చ అయితే అందరిలోనూ ఉండేది. అవతల వైపు చూస్తే ఎన్టీఆర్ అనర్గళంగా ఉపన్యాసాలు చేసేవారు. ఆనాటికి అంతలా అచ్చమైన తెలుగులో అద్భుతమైన ప్రసంగాలు గంటల తరబడి చేస్తూ ప్రజలను మెప్పించే ఏకైక రాజకీయ నేతగా ఎన్టీఆర్ మాత్రమే ఉండేవారు.

అలాంటిది ఆయన ప్లేస్ లోకి వచ్చిన చంద్రబాబు టీడీపీకి ఏమి గ్లామర్ గ్రామర్ ఇవ్వగలరు అన్న సందేహలూ అందరిలోనూ ఏర్పడ్డాయి. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ చంద్రబాబు మెల్లగా తన ప్రసంగాలను మార్చుకున్నారు. ఆయన స్పీచ్ లో ఎక్కువగా చెప్పినదే చెబుతూ ఉండడం కనిపించినా ప్రజల బుర్రలలో ఏ మ్యాటర్ తాను అనుకుంటారో దానిని జొప్పించడంలో మాత్రం నైపుణ్యం సాధించారు.

ఎన్టీఆర్ తో ఎవరినీ పోల్చాల్సిన అవసరం లేదు కానీ చంద్రబాబు మాత్రం తన తరహాలో ప్రసంగాలు చేస్తూ అవి గంటల తరబడి సాగేలా చూసుకున్నారు. ఆయన ప్రజలకు ప్రసంగాలతో కనెక్ట్ కావడం కంటే అందులో సబ్జెక్ట్ తోనే కనెక్ట్ అయినదే ఎక్కువ. ఆయన ప్రత్యర్ధులను విమర్శించినా లేక తన ప్రభుత్వం గురించి తన పార్టీ గురించి గట్టిగా చెప్పుకున్నా జనాలకు అది నిజమే అనిపించేలా చెప్పడంలో దిట్ట అనిపించుకున్నారు.

టీడీపీలో ఎన్టీఆర్ లేని లోటుని బాబు తీర్చగలరా అన్న వారికి తీర్గగలను అని గత ముప్పయ్యేళ్ల ప్రస్థానంలో బాబు రుజువు చేశారు. 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యారు. అది కూడా చాలా ఉత్కంఠ ఉద్రిక్త పరిస్థితుల మధ్యన. ఆ సమయంలో ఎన్టీఆర్ బతికే ఉన్నారు. దాంతో బాబు పదవి మూడునాళ్లే అని అంతా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ కేవలం నాలుగున్నర నెలలు మాత్రమే ఆ తరువాత జీవించారు.

దాంతో టీడీపీ బాబుదే అన్నది కన్ ఫర్మ్ అయిపోయింది. ఆ తరువాత బాబు తనదైన వ్యూహాలు చతురతతో టీడీపీని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఎన్టీఆర్ టీడీపీకి ఊపిరి పోసినా కేవలం 14 ఏళ్ళు మాత్రమే అధినేతగా ఉన్నారు. అదే చంద్రబాబు ముప్పయ్యేళ్ళుగా పార్తీని మోస్తున్నారు. అంటే అన్న గారి శ్రమకు డబల్ పరిశ్రమ అన్న మాట.

దాంతో టీడీపీ ఈ రోజుకు ఇలా ఉంది అంటే అది బాబు రెక్కల కష్టం అని తప్పక చెప్పాల్సిందే. సీఎం అయినప్పుడు ఎటువంటి అంచనాలు లేకుండా ఒక సాదా సీదా నేతగా కనిపించిన బాబు ఆ తరువాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడమే కాదు ఏపీకి నాలుగవ సారి సీఎం అయ్యారూ అంటే కచ్చితంగా అది ఆయన నాయకత్వ లక్షణాలకు అచ్చమైన నిదర్శనం అని చెప్పాల్సిందే.