ఎన్డీఏకు టీడీపీ మద్దతు ఉప సంహరించాలా ?
కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి రెండు ఊత కర్రలుగా అటు టీడీపీ ఇటు జేడీయూ ఉన్నాయి. ఈ రెండు పక్షాలలో బలమైన ఊతకర్రగా టీడీపీ ఉంది.
By: Tupaki Desk | 16 Sep 2024 7:30 AM GMTకేంద్రంలో మోడీ ప్రభుత్వానికి రెండు ఊత కర్రలుగా అటు టీడీపీ ఇటు జేడీయూ ఉన్నాయి. ఈ రెండు పక్షాలలో బలమైన ఊతకర్రగా టీడీపీ ఉంది. టీడీపీ మీదనే బీజేపీ పెద్దలు ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఉన్నారు. చంద్రబాబుకు ఉన్న ఏపీ అవసరాలను తీర్చడంతో ఆయనను మచ్చిక చేసుకుని అయిదేళ్ళూ బండిని నడిపించాలని కూడా ఆలోచిస్తున్నారు.
అయితే కొన్ని పాలసీల విషయంలో మాత్రం బీజేపీ పెద్దలు ససేమిరా అనే అంటున్నారు. అది ఈ రోజుకీ కొనసాగుతోంది. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఒకటి. ఇది పాలసీ డెసిషన్ అని బీజేపీ పెద్దలు అంటున్నారు. ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలో మినహాయింపు ఇస్తే మిగిలిన లిస్ట్ లోని పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలన్నీ రిలాక్సేషన్ కోరుతాయని అపుడు పాలసీయే ఉండదన్నది బీజేపీ పెద్దల ఆలోచన.
ఇక బీజేపీ విధానాలు ఎలా ఉన్నాయి అన్నది ఆ పార్టీ నేతలే తరచూ చెబుతూ ఉంటారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అన్నది వారి ఫిలాసఫీ. అలా లాభ నష్టాలను చూడకుండా ప్రభుత్వం ముందుకు సాగాలని ప్రజా సంక్షేమమే విధానం కావాలన్నది ఆ పార్టీ పెద్దల ఆలోచన.
అందుకే దశల వారీగా దేశంలోని పరిశ్రమలను అన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలన్న పాలసీ ఉందని అంటారు. అందులో స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. స్టీల్ ప్లాంట్ నష్టాలలో ఉంది. దానికి తిరిగి లాభాల బాట పట్టించాలి అంటే వేల కోర్ట్ల ఖర్చు అన్నది కూడా ఉంది. అదే దానికి ప్రైవేట్ పరం చేస్తే పూచీ పేచీలు ఉండవని అంటున్నారు
అయితే ఇక్కడ మిగిలిన పరిశ్రమలకు స్టీల్ ప్లాంట్ కి తేడా ఏంటి అంటే మిగిలినవి ప్రభుత్వం అనుకుని పెట్టినవి. స్టీల్ ప్లాంట్ అలా కాదు ఏపీ మొత్తం కోరి మరీ సాధించుకున్నది. అందువల్లనే దీనికి ఆ ప్రత్యేకత ఉంది. కానీ పాలసీ విషయంలో సెంటిమెంట్లకు తావు లేదని బీజేపీ అంటోంది.
ఈ రకమైన సంక్లిష్ట పరిస్థితులలో బీజేపీకి టీడీపీకి మధ్య ఏమైనా విభేదాలు వస్తే ఇక్కడే రావచ్చు అని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అయితే ప్రైవేటీకరణకు కట్టుబడి ఉందని అంటున్నారు. కాకపోతే దాని మీద ఏమైనా సవరణలకు మాట్లాడే చాన్స్ ఉందేమో కానీ మొదటి దానికి అయితే వీలే లేదు అని అంటున్నారు.
మరి ఏపీ విషయంలో బీజేపీకి రాజకీయంగా కూటమిలో ఉండడం వల్ల లాభమే కలిగింది. స్టీల్ ప్లాంట్ సమస్య ఉన్నా కూడా నాలుగు ఎంపీ సీట్లు ఆ పార్టీ ఖాతాలోకి వచ్చాయి. దాంతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఇది రాజకీయంగా దెబ్బ తీసే అంశం కాదని అర్ధం అయింది.
అందుకే దూకుడుగా వెళ్తోంది. కానీ టీడీపీకి మాత్రం అలా కాదు ఆ పార్టీకి ఉత్తరాంధ్ర కంచుకోట. విశాఖ అంటేనే పసుపు పార్టీకి జై కొట్టే నగరం. అలాంటి చోట స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే ఆ వేడిని వాడిని టీడీపీయే తట్టుకోవాలి. కానీ ఇంకా అయిదేళ్ళ పాటు ప్రభుత్వం ఉంటుంది. ఈ లోగా ఎన్నో మార్పులు వస్తాయి.
కాబట్టి మరేం ఫరవాలేదు అన్నది బీజేపీలో ఏమైనా ఉందేమో కానీ టీడీపీకి మాత్రం అది ప్రాణ సంకటం లాంటి సమస్య. అందుకే కేంద్రంతో ఈ విషయం తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి మెత్తగా చెబితే కేంద్ర పెద్దలు వింటారా అంటే అది కాదు అని తేలిపోతోంది. మరి ఎంతదాకా వెళ్లాలి అంటే మద్దతు ఉప సం హరణ దాకా వెళ్లాల్సిందే అని అంటున్నారు.
ఈ విషయంలో ఎగదోస్తోంది వైసీపీయే అని చెప్పాలి. వైసీపీకి చెందిన మాజీ మంత్రి మండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని అంటున్నారు. అంటే మద్దతు ఇవ్వమని టీడీపీ చెప్పాలన్నదే వైసీపీ ఆలోచనా అని కూడా అంటున్నారు.
టీడీపీ అధినాయకత్వం అయితే ఏమి ఆలోచిస్తుందో తెలియదు కానీ అంత దాకా వెళ్తేనే తప్ప స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అని వైసీపీ అంటోంది. మరి వైసీపీ ఇస్తున్న ఈ సలహా టీడీపీ పాటిస్తుందా అంతటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటుందా అంటే వెయిట్ అండ్ సీ.