Begin typing your search above and press return to search.

ఆపరేషన్ సౌత్ ఎన్డీఏ విస్తరణకు చంద్రబాబుకు బాధ్యతలు!

ఉత్తరాదిలో సత్తాచాటుతున్న బీజేపీ.. దక్షిణాదిలో ఎదగాలనే తన ఆశలను నెరవేర్చుకోవడంలో విఫలమవుతుంది.

By:  Tupaki Desk   |   20 Dec 2024 4:30 PM GMT
ఆపరేషన్ సౌత్ ఎన్డీఏ విస్తరణకు చంద్రబాబుకు బాధ్యతలు!
X

ఉత్తరాదిలో సత్తాచాటుతున్న బీజేపీ.. దక్షిణాదిలో ఎదగాలనే తన ఆశలను నెరవేర్చుకోవడంలో విఫలమవుతుంది. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో బీజేపీ బలం నామమాత్రంగానే ఉంది. కర్ణాటకలో గత ఏడాది అధికారం కోల్పోయిన తర్వాత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది బీజేపీ. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఎన్డీఏని విస్తరించి తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా. ఒకవైపు జమిలి ఎన్నికల దిశగా సన్నాహాలు చేస్తూనే మరోవైపు దక్షిణాదిలో ఎన్డీఏ విస్తరణ ప్రణాళికను పదునెక్కించేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం దక్షిణాదిలో టీడీపీ, జనసేన, జనతాదళ్ సెక్యులర్ పార్టీలు మాత్రమే ఎన్డీఏ భాగస్వామ పక్షాలుగా కొనసాగుతున్నాయి. తమిళనాడులోని అన్నా డీఎంకే గత సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏలో మరిన్ని పార్టీలను కలుపుకోవడం, ఎన్డీఏ పక్ష పార్టీలను బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు ప్రణాళిక రచిస్తున్నారు. ఇందుకోసం ముగ్గురు కేంద్ర మంత్రులతో ఓ సమన్వయ కమిటీని నియమించారు. ఈ కమిటీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టచ్ లో ఉంటూ ఎన్డీఏ బలోపేతానికి తీసుకోవాల్సిన నిర్ణయాలను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకి వివరిస్తారు.

ఎన్డీఏ బలోపేతానికి అవసరమైన వ్యూహాలను చంద్రబాబు అమలుచేస్తే, ఆయా రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాల బాధ్యతను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చూస్తారని చెబుతున్నారు. అదేవిధంగా చంద్రబాబుతో ఎప్పటికప్పుడు సంప్రదస్తూ కీలక సూచనలు చేసేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడుతోపాటు భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఉంటారు. వీరు దక్షిణాది రాష్ట్రాల సమస్యలు, వాటి పరిష్కారాలను సూచిస్తారు. వీరికి సహాయంగా మరికొందరు కేంద్ర మంత్రులతో ఆయా రాష్ట్రాల స్థాయిలో ఉప కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీల్లో కనీసం పది మంది సభ్యులు ఉంటారు. వీరు దక్షిణాది రాష్ట్రాల్లో ఏ విధంగా విస్తరణ ప్రణాళికలు ఉండాలి? అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సూచనలివ్వాల్సివుంటుంది. ఇలా రానున్న రెండుమూడేళ్లలో దక్షిణాదిలో బలపడాలనేది బీజేపీ పెద్దల వ్యూహాంగా చెబుతున్నారు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం బాగా తగ్గిపోయింది. గత రెండు దఫాలుగా సొంత బలంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఈ దఫా మాత్రం టీడీపీ, జేడీయూ వంటి భాగస్వామ్యపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ప్రస్తుతం లోక్ సభలో బీజేపీ బలం 240. వచ్చే ఎన్నికల నాటికి జమిలి నిర్వహించినా తమ అధికారానికి ఎలాంటి ప్రమాదం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఎన్నికలకు చాలా సమయం ఉన్నా, ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిలో కర్ణాటకలో తప్పితే మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ బలం అంతంత మాత్రమే. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలం పెంచుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాన పోటీదారుగా ఎదిగే క్రమంలో కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల వెనకబడిపోయింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలంటే దక్షిణాదిలో బీజేపీ సొంతంగా ఎదగడంతోపాటు తమ భాగస్వామ్య పక్షాలైన ఎన్డీఏ పార్టీలు బలపడాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకోసం ముగ్గురు కేంద్ర మంత్రులతో కమిటీ వేసి దక్షిణాదిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చంద్రబాబు సూచనలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.