టాలీవుడ్ పై చంద్రబాబు మౌనం.. నష్ట పరిచిందా..!
దీంతో ఇక, టాలీవుడ్‌కు ఏపీనే గమ్య స్థానం అని అందరూ భావించారు. ఈ అవకాశాన్ని సీఎం చంద్రబాబు అందిపుచ్చుకుంటారని కూడా అందరూ అనుకున్నారు.
By: Tupaki Desk | 27 Dec 2024 12:30 PM GMTటాలీవుడ్ వ్యవహారం.. ఇప్పుడు దారికి వచ్చేసింది. తెలంగాణలో రేగిన పుష్ప-2 చిచ్చు కారణంగా.. గత వారం రోజులుగా నెలకొన్న పరిస్థితులు.. పరిణామాలు టాలీవుడ్‌ను చివురుటాకు మాదిరిగా వణికించాయి. బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ల ధరల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు వంటివి టాలీవుడ్‌ను ఘాటెక్కించాయి. దీంతో ఇక, టాలీవుడ్‌కు ఏపీనే గమ్య స్థానం అని అందరూ భావించారు. ఈ అవకాశాన్ని సీఎం చంద్రబాబు అందిపుచ్చుకుంటారని కూడా అందరూ అనుకున్నారు.
అయితే.. చంద్రబాబు ఈ విషయంలో మౌనం వహించారు. నిజానికి ఆయన చొరవ చూపించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు, ఇతర సమస్యల కారణంగా.. ఈ విషయంలో తాను జోక్యం చేసుకుంటే.. మరిన్ని వివాదాలు పెరుగుతాయని భావించారో.. లేక మనకెందుకులే..ఇప్పుడు అనుకున్నారో తెలియదు కానీ.. అనూహ్యంగా ఏపీ విషయం చర్చకు రాకుండా పోయింది.
అదే కనుక చంద్రబాబు జోక్యం చేసుకుని టాలీవుడ్ కు అనుకూలంగా చర్చించేందుకు రెడీ అయి ఉంటే.. హైదరాబాద్ తో పాటు సమాంతరంగా విశాఖ, అమరావతి లేదా రాజమండ్రి నగరాల్లో టాలీవుడ్ ఇండస్ట్రీని డెవలప్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి ఉంటే పరిస్థితి అనుకూలంగా ఉండేదని అంటు న్నారు. ఈ విషయంలో చంద్రబాబు సుదీర్ఘ మౌనం పాటించారు. ఇది ఆయనకు ఇబ్బంది కలిగించింది. ఇక, పార్టీ పరంగా కూడా.. ఈ విషయంపై భిన్నాభిప్రాయం రాలేదు.
టాలీవుడ్‌ను ఏపీకి ఆహ్వానించి ఉంటే బాగుండేదని అందరూ అనుకున్నారు. వాస్తవానికి తెలంగాణలో వివాదం చెలరేగడం.. ఆ వెంటనే.. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన.. తర్వాత.. ఏపీనే గమ్యస్థానం అంటూ.. పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియాలోనూ వార్తలు హల్చల్ చేశాయి. ఈ పరిణామాలే అనుకూలంగా మారుతాయని అనుకున్నా.. చంద్రబాబు జోక్యం తగ్గడం.. పవన్ కల్యాణ్ కూడా పట్టనట్టు వ్యవహరించడంతో టాలీవుడ్ తిరిగి తెలంగాణనే మచ్చిక చేసుకుంది.