Begin typing your search above and press return to search.

'అమరావతి' ఏఐ సిటీ ఆఫ్ ఇండియా.. సౌండ్ అదిరిపోయింది కదూ..

ఇందులో భాగంగా ఇప్పుడు అమరావతిని ఏఐ సిటీగా మార్చాలని కొత్తగా ప్రతిపాదిస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Jan 2025 6:25 AM GMT
అమరావతి ఏఐ సిటీ ఆఫ్ ఇండియా.. సౌండ్ అదిరిపోయింది కదూ..
X

రాజధాని అమరావతిని ఏఐ సిటీ ఆఫ్ ఇండియాగా మార్చాలనే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ)పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక ప్రసంగం చేశారు మంత్రి లోకేశ్. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి రాజధానిపై ప్రత్యేక ఫోకస్ చేసింది.

నవ నగరాల కాన్సెప్ట్ తో రాజధాని అమరావతికి బీజం పడింది. ఏపీ అభివృద్ధికి రాజధాని అమరావతిని గేమ్ ఛేంజర్ చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 2014-19 మధ్య రాజధానిని తొమ్మిది నగరాలుగా నిర్మించాలని ప్లాన్ చేశారు. ఫైనాన్షియల్‌ సిటీ, గవర్నమెంట్‌ సిటీ, జస్టిస్‌ సిటీ, నాలెడ్జ్‌ సిటీ, మీడియా సిటీ, స్పోర్ట్స్‌ సిటీ, హెల్త్‌ సిటీ, ఎలక్ట్రానిక్‌ సిటీ వంటి నవ నగరాలు నిర్మించాలని భావించారు. దీనికి తగ్గట్టే మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. అయితే గత ఐదేళ్లుగా ఈ పనులు సాగకపోవడంతో అమరావతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సందేహాలన్నీ పటాపంచలై రాజధాని పనులు మరోసారి పట్టాలెక్కాయి. అంతేకాకుండా నవ నగరాలతోపాటు అమరావతికి అదనపు హంగులు అద్దేలా సీఎం చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పుడు అమరావతిని ఏఐ సిటీగా మార్చాలని కొత్తగా ప్రతిపాదిస్తున్నారు. ఐటీ పాలసీలో భాగంగా డీప్ టెక్నాలజీ హబ్ ను సైతం అమరావతిలో నెలకొల్పాలని చూస్తున్నారు. మరోవైపు డ్రోన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ద్వారా అమరావతిని దేశానికే డ్రోన్ క్యాపిటల్ చేయాలని చూస్తున్నారు. టెక్నాలజీకి పెద్దపీట వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన విజయవంతమైన హైటెక్ సిటీ ఫార్ములాను అమరావతికి వర్తింపజేయాలని చూస్తున్నారు. హైదరాబాదులో హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత ఐటీ రంగంలో ఆ నగరం దూసుకుపోయింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలన్నీ హైదరాబాద్ లో స్థాపించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఉందని చెబుతుంటారు. ఈ పరిస్థితుల్లో అమరావతిని అగ్రపథాన నిలపడంలో భాగంగా ఇప్పుడు ఏఐ సిటీ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు.

అమరావతిలోనే AI ఉందని గతంలోనే చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు తన కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆగస్టు నెలలో సీఆర్డీఏ సమీక్షలో భాగంగా అమరావతి లోగోను AI పోలిన విధంగా డిజైన్ చేయాలని ఆదేశించారు. ఇంగ్లీషు అక్షర క్రమంలో అమరావతి పేరు Aతో మొదలవుతుంది. చివరి అక్షరం I తో ముగుస్తుంది. అందువల్ల AI అంటే అమరావతే గుర్తుకు రావాలని సీఎం ఆకాంక్షిస్తున్నారు.

రానున్న కాలంలో ప్రపంచం మొత్తం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ టెక్నాలజీపైనే ఆధారపడుతుందని అంచనాలు ఉన్నాయి. అందువల్ల అమరావతి స్పురణకు వచ్చినప్పుడల్లా AI గుర్తుకు రావాలని, రాజధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా, ఐటీతోపాటు ఐబీఎం, జీనోమ్ వ్యాలీ వంటి ఇతర రంగాలల్లోనూ హైదరాబాద్ ను మేటిగా నిలిపారు చంద్రబాబు. అదేవిధంగా ఇప్పుడు అమరావతిని కూడా మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నారు. తన ప్రణాళిక ప్రకారం నవ నగరాలతోపాటు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునేలా నూతన రాజధాని నగరాన్ని నిర్మించి అమరావతిని దేశంలోనే ఒక రోల్ మోడల్ సిటీగా నిలపాలని చూస్తున్నారు. ఏదైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఐదు కోట్ల ఆంధ్రుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి.