Begin typing your search above and press return to search.

ఏపీలో ఏఐ పాల‌న‌.. : చంద్ర‌బాబు

ఏపీలో వాట్సాప్ పాల‌నను ప్రారంభించామ‌ని, ఇక నుంచి ఏఐ పాల‌న‌ను ప్రారంభిస్తున్నామ‌ని సీఎం చంద్రబాబు తెలిపారు.

By:  Tupaki Desk   |   25 March 2025 11:30 AM
Chandrababu On AI Governance
X

ఏపీలో వాట్సాప్ పాల‌నను ప్రారంభించామ‌ని, ఇక నుంచి ఏఐ పాల‌న‌ను ప్రారంభిస్తున్నామ‌ని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశం మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. మిషన్ ఆంధ్ర@2025 లక్ష్యాల సాధనకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు వారి జిల్లాల జిల్లా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకోవాల‌ని సూచించారు.

నిరుపేదలకు సాయం అందించే వేదికగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పీ4 కార్యక్రమం అమలుకు అనుగు ణంగా క‌లెక్ట‌ర్లు పాల‌న‌ను స‌రిచేసుకోవాల‌న్నారు. జిల్లాకు నాయకత్వం వహించే జిల్లా కలెక్టర్ల అంతిమ లక్ష్యం ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమమే కావాలని సూచించారు. ''బిల్ గేట్స్ మాటల్లో చెప్పాలంటే ఇతరులను ఎవరైతే శక్తివంతంగా తీర్చిదిద్దే వారే తదుపరి శతాబ్దపు నాయకులు'' అని పేర్కొన్నారు.

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ 'పీపుల్ ఫస్ట్' అనే నినాదంతో తమ పాలన కొనసాగిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఆ లక్ష్యంతోనే ప్రస్తుతం మూడో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహిస్తున్నామ‌న్నారు. గత పాలకులు(వైసీపీ) కేవలం విధ్వంసం చేయ‌డానికే 5 ఏళ్ల స‌మ‌యం వాడుకున్నార‌ని తెలిపారు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం ప్రజల ఆకాంక్షలు, ఆశయాలే సాధనగా ప‌నిచేస్తుంద‌న్నారు.

ప్రజల ఆకాంక్షలు ఆశయాలు నెరవేర్చడానికి, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి అనుగుణంగా శక్తి వంతమైన డెలివరీ మెకానిజంతో జిల్లా కలెక్టర్లు పని చేసేందుకు అనుగుణంగా నూతన ఫార్మాట్లను రూపొందిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు వివ‌రించారు. పాల‌న‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు తీసుకు వెళ్లాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ల‌కు దిశానిర్దేశం చేశారు. క‌లెక్ట‌ర్లు, జిల్లాల ఎస్పీలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని.. జీరో రౌడీయిజం దిశ‌గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల‌ని సూచించారు.