జనం మెచ్చేలా.. మనకు నచ్చేలా: బడ్జెట్‌పై చంద్రబాబు కామెంట్స్
తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి(అసెంబ్లీ-శాసన మండలి) గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు
By: Tupaki Desk | 11 Feb 2025 11:11 AM GMTఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి(అసెంబ్లీ-శాసన మండలి) గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం.. ఆయనకు ధన్యవాదాలుతెలిపే తీర్మానం ఉంటుంది. ఆతర్వాత.. రెండు రోజులకు అంటే.. మార్చి 1న ఏపీ బడ్జెట్ 2025-26ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలనుఅమలు చేస్తుందా? లేక.. ఏం చేస్తుంది? అనే ఆలోచన చర్చ కూడా... సర్వత్రా కనిపిస్తోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలపై ప్రజల్లో మరింత ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ హామీల్లో ఒక్క ఉచిత గ్యాస్ పంపిణీ పథకం మాత్రమే అమ లవుతోంది. పింఛను పెంచి పంపిణీ చేస్తున్నా.. అది సూపర్ సిక్స్ కోటాలో లేదు. దీంతో వచ్చే బడ్జెట్లో ఈ విషయాలు ఉంటాయా? ఉండవా? అని ఎదురు చూస్తున్నారు.
ఈ ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో సీఎం చంద్రబాబు తాజాగా కొన్ని లీకులు ఇచ్చారు. సచివాలయంలో జరుగుతున్న మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే బడ్జెట్‌లో ప్రజల ఆకాంక్షలు కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. 2025-26 ఆర్థిక బడ్జెట్ వినూత్నంగా ఉండాలని ఆకాంక్షించారు. అదేసమయంలో ప్రజలు మెచ్చేలా ప్రభుత్వానికి నచ్చేలా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ప్రతీ విభాగానికీ కేటాయింపులు ఉండేలా చూడాలని ఈ సందర్భంగా సదరు మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
ఏపీ వృద్ధి రేటు పెంచేలా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. తద్వారా.. రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ది కనిపిస్తుందన్నారు. అయితే.. ఈ బడ్జెట్‌పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్న వారికి ఈ దఫా మేలు జరిగే అవకాశం కనిపిస్తోందన్నారు. మొత్తానికీ సీఎం చంద్రబాబు వార్షిక బడ్జెట్‌పై కొంత ఉప్పందించినట్టు అయింది. మరి ఎలా ఉంటుందో చూడాలి.