మంత్రుల నుంచి బాబు కోరుతోంది ఇదేనా ..!
మంత్రుల జాతకాలు తన వద్ద ఉన్నాయంటూ.. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. మంత్రి వర్గంలో చర్చనీయాంశంగా మారాయి.
By: Tupaki Desk | 20 Dec 2024 5:30 PM GMTమంత్రుల జాతకాలు తన వద్ద ఉన్నాయంటూ.. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. మంత్రి వర్గంలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన కోరుకుంటున్న విధంగా మంత్రులు పనిచేయడం లేదని.. ఆయన వేగానికి వారు సరిరావడం లేదని కొన్నాళ్లుగా మంత్రి నారా లోకేష్ చెబుతున్న విషయం తెలిసిందే. తాను కూడా సీఎం చంద్రబాబుతో పోటీ పడలేక పోతున్నానని చెప్పారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన కేబినెట్ మీటింగులో సీఎం చంద్రబాబుచేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
ఈ క్రమంలో అసలు చంద్రబాబు మంత్రుల నుంచి ఏం ఆశిస్తున్నారన్నది ఆసక్తిగా మారింది. చంద్రబాబు పనితీరు అందరికీ తెలిసిందే. రోజుకు 18 గంటలు ఆయన పనిచేస్తానని చెప్పుకొంటారు. అదేసమయంలో సమస్యలు రాకుండా.. వివాదాలకు తావులేకుండా.. నిర్ణయాలు తీసుకుంటారని కూడా చెబుతారు. పని ముఖ్యం అనే కాన్సెప్టును చంద్రబాబు పుణికి పుచ్చుకున్నారు. అయితే.. అందరూ తనలాగానే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు.
కానీ, ఈ విషయంలోనే మంత్రులకు, ముఖ్యమంత్రికి మధ్య ప్రధానంగా రెండు తేడాలు కనిపిస్తున్నాయి. 1) సమయం వెచ్చించలేక పోవడం. 2) అనుకున్న విధంగా కార్యక్రమాలు పూర్తి చేయలేక పోవడం. ఈ రెండు సమస్యలు మంత్రులను వేధిస్తున్నాయి. చంద్రబాబు విషయానికి వస్తే.. కుటుంబం పరంగా ఆయనకు పెద్దగా బాధ్యతలు లేవు. అందరూ సెటిల్ అయిపోయారు. కానీ, మంత్రుల విషయానికి వస్తే.. ఇంకా, వారికి కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. దీంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది.
అదేసమయంలో అధికారుల పనితీరును అంచనా వేయడంలోనూ మంత్రులు ఒకింత వెనుకబడ్డారనే చెప్పాలి. ఇప్పటికీ చాలా మంది మంత్రులకు వారి వారి శాఖలపై పట్టు రాలేదు. ఆరు మాసాలు గడిచినా.. తమ శాఖలపై పట్టు రాలేదని.. కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి నిధుల కొరత కావొచ్చు. లేదా.. వారికి నచ్చని శాఖలను చంద్రబాబు ఇవ్వడం కావచ్చు. మొత్తంగా మంత్రులు కొంత వెనుకబడ్డా రనే చెప్పాలి. ఏదేమైనా.. చంద్రబాబు కోరుతున్న విధంగా మంత్రులు పనిచేసేందుకు కొంత సమయం అయితే పట్టనుందనేది వాస్తవం.