Begin typing your search above and press return to search.

బూడిద పంచాయతీ... జేసీ అస్మిత్ రెడ్డికి షాకిచ్చిన చంద్రబాబు!

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ) ఫ్లైయాష్ వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Dec 2024 5:34 AM GMT
బూడిద పంచాయతీ... జేసీ అస్మిత్ రెడ్డికి షాకిచ్చిన చంద్రబాబు!
X

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ) ఫ్లైయాష్ వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఫ్లైయాష్ కోసం జమ్మలమడుగు, తాడిపత్రి నియోజకవర్గాల్లోని కూటమి నేతల మధ్య రచ్చ నెలకొంది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ఈ నేపథ్యంలో అస్మిత్ రెడ్డికి షాక్ ఇచ్చారు!

అవును... ఆర్టీపీపీ బూడిద తరలింపు వ్యవహారంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇవి తీవ్రస్థాయికి చేరుకున్నాయని అంటున్నారు. ఈ విషయంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు. దీంతో.. ఈ పంచాయతీ బాబు వద్దకు చేరింది.

ఇందులో భాగంగా... జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి పురపాలక అధ్యక్షుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ ఛార్జ్ భూపేష్ రెడ్డి కి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వర్తమానం అందింది. అయితే... ఈ పంచాయతీ ప్రోగ్రాం కి జేసీ ప్రభాకర్ రెడ్డి డుమ్మా కోట్టారని అంటున్నారు!

దీనిపై స్పందించిన ఆదినారాయణ రెడ్డి... ఈ వ్యవహారాన్ని తాను పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు! ఆ సంగతి అలా ఉంటే... పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో పర్యటించిన చంద్రబాబు.. తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

శనివారం అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబును ఎయిర్ పోర్ట్ లో తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను చంద్రబాబు తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ.. బాహాటంగా గొడవలకు దిగడం ఏమిటంటూ ప్రశ్నించారని అంటున్నారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి... పార్టీ కార్యకర్తలకు పనులు కల్పించేందుకేనని సీఎంకు సమాధానం చెప్పారని అంటున్నారు. అయితే.. కార్యకర్తల సంగతి తాను చూసుకుంటానని అస్మిత్ రెడ్డికి చంద్రబాబు స్పష్టం చేశారని అంటున్నారు.