ఫలించిన చంద్రబాబు మంత్రం.. కేంద్రం రైతుకు ఊరట!
రాష్ట్రంలోని మిర్చి రైతులకు ఊరట కల్పిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్రం లో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన, నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 24 Feb 2025 9:30 PM GMTరాష్ట్రంలోని మిర్చి రైతులకు ఊరట కల్పిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్రం లో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన, నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మిర్చి వాణిజ్య పంట కావడంతో దీనికి మద్దతు ధర లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే రైతులను ఆదుకోవాల్సి వచ్చింది. అయితే.. మరోవైపు మార్కెట్ ధరలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు నెలల తరబడి దిగుబడిని విక్రయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలో గుంటూరు మిర్చియార్డులో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, ప్రతిపక్ష వైసీపీ కూడా ఇక్కడ ఆందోళన చేసి.. రైతులకు మద్దతు పేరుతో హడావుడి చేసింది. ఈ పరిణామాల క్రమంలోనే కేం ద్రానికి సీఎం చంద్రబాబు లేఖరాయడం.. రైతులకు అండగా ఉండి ఆదుకోవాలని ఆయన విన్నవించ డం తెలిసిందే. ఇక, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని కేంద్రం తో పలుమార్లు చర్చించారు.
కేంద్ర వ్యవసాయ మంత్రిని కూడా పలుమార్లు కలుసుకుని మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ధరను పెంచాలని కోరారు. ప్రస్తుతం వస్తున్న ధరకు రూ.11800 వరకు ఇవ్వాలని కోరారు. అలాగే.. మార్కెట్ ఇంటర్ వెన్షన్ ధరను 25 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని విన్నవించారు. ఈ రెండు విషయాలపై కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ధరను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా మిర్చిని క్వింటాకు రూ.11,781 ఇచ్చి కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది.
నేటి నుంచి నెల..
కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు.. నెల రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. ఈనెల రోజుల్లో 2.53 లక్షల క్వింటాళ్ల మిర్చిని కేంద్రం నేరుగా కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించి పూర్తిగా.. కేంద్రమే సొమ్ములు చెల్లించేందుకు సిద్ధమైంది. దీంతో చంద్రబాబు చేసిన ప్రయత్నం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన ప్రయత్నం ఫలించాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు.