Begin typing your search above and press return to search.

వెల్ కమ్ టూ 2025 : అభివృద్ధికి గేమ్ చేంజర్ అంటున్న బాబు

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశావాది. అంతే కాదు వాస్తవవాది కూడా. ఆయన 2000లో ఉంటూ విజన్ 2020 అని నినదించారు.

By:  Tupaki Desk   |   31 Dec 2024 5:30 PM GMT
వెల్ కమ్ టూ 2025 : అభివృద్ధికి గేమ్ చేంజర్ అంటున్న బాబు
X

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశావాది. అంతే కాదు వాస్తవవాది కూడా. ఆయన 2000లో ఉంటూ విజన్ 2020 అని నినదించారు. ఆ మేరకు అద్భుతమైన ప్రణాళికలను రూపొందించారు. ఇపుడు 2024 లో ఉంటూ 2047 విజన్ అంటున్నారు. మరి అంతటి దూరదృష్టి కలిగిన చంద్రబాబు 2025ని ఎలా ప్లాన్ చేయాలో తెలియకుండా ఉంటారా. అందుకే ఆయన కొత్త ఏడాదిని శుభారంభంగా భావిస్తున్నారు.

ఆయన మదిలో అనేక ఆలోచనలు ఉన్నాయి. ఏపీ అంటే కూడా బాబు సరికొత్త నిర్వచనం చెప్పి ఉన్నారు. ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం. సరిగ్గా ఈ రెండూ కూడా ఏపీ అభివృద్ధిని మలుపు తిప్పుతాయని ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఇక 2024లో అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాల కోసం ప్రపంచ బ్యాంక్ సహా వివిధ ఏజెన్సీల నుంచి నిధులను సమీకరణ చేయడంలో సఫలీకృతమైన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది రాజధాని పనులను మొదలెట్టడానికి ముహూర్తంగా పెట్టుకుంది.

కొత్త ఏడాది మొదలవుతూనే రాజధాని పనులు స్టార్ట్ అవుతాయని అంటున్నారు. ఈ ఏడాదితో రెండు విడతలుగా ప్రపంచ బ్యాంక్ ఆసియన్ బ్యాంక్ నిధులు విడుదల అవుతున్నాయి. వాటితో ఏఏ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాలి అన్నది టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే రూపకల్పన చేసి ఉంచింది. టెండర్లను సైతం పిలుస్తున్నారు. దాంతో కొత్త ఏడాదిలో అమరావతి పనులు శరవేగాన్ని అందుకుంటాయని అంటున్నారు.

ఇప్పటిదాకా అమరావతి రాజధాని పేరిట శాశ్వతమైన పనులు ఏవీ జరగలేదు. 2025లో ఆ పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ విధంగా చూస్తే బాబు కలలు పండే ఏడాదిగా 2025ని పేర్కొనాలి అని అంటున్నారు. అంతే కాదు 2025లో అమరావతి రాజధాని విషయంలో పనుల పురోగతి కూడా ఆశించిన స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే కూటమి ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయంగానూ దీనిని చెప్పుకోవచ్చు అని అంటున్నారు.

ఇక పోలవరం విషయానికి వస్తే ఇప్పటికే 11 వేల కోట్ల దాకా కేంద్ర ప్రభుత్వం రీ ఎంబర్స్ మెంట్ నిధులను విడుదల చేసింది. రానున్న కాలానికి ఖర్చు చేసేందుకు నిధులు కూడా అడ్వాన్స్ గా విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఇక కొత్త ఏడాది డయాఫ్రం వాల్ నిర్మాణం పనులు మొదలవుతాయని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కి డయాఫ్రం వాల్ పరిపూర్తి అతి పెద్ద కీలకంగా మారుతుంది అని అంటున్నారు.

గత ప్రభుత్వ హయాంలో డయాఫ్రం వాల్ దెబ్బ తిందని దాని వల్ల పోలవరం పనులు ఏ విధంగానూ ముందుకు సాగేందుకు వీలు లేకుండా పోయిందని అంటున్నారు. డయా ఫ్రం వాల్ పూర్తి అయితే రెండు సీజన్లలో మిగిలిన పనులను పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో 2027 నాటికి పోలవరం జాతికి అంకితం చేయాలన్నాది కూటమి ప్రభుత్వం పెట్టుకున్న అజెండాగా ఉంది అని అంటున్నారు.

ఆ పనులు జరగాలంటే 2025 అతి కీలకమైన ఏడాదిగా ఉంది. దాంతో ఈ ఏడాది పోలవరానికి వరం ఇచ్చేదిగా చంద్రబాబు భావిస్తున్నారు. ఇటీవల ఆయన ఢిల్లీకి వెళ్ళినపుడు ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ కి నిధులు ఎక్కువగా ఇవ్వాలని కోరారు. వాటి మీద కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. దాంతో 2025లో బాబు ఏపీ ప్రాజెక్టులు రెండూ దూకుడుగా సాగుతాయని అంటున్నారు.