Begin typing your search above and press return to search.

తెలుగు ప్రజలకు చంద్రబాబు సంక్రాంతి విషెస్... ఊరెందుకెళ్తున్నారంటే..?

ప్రస్తుతం ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి సందడి మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఈ పండకకు సిద్ధమవుతున్నారు

By:  Tupaki Desk   |   11 Jan 2025 10:21 AM GMT
తెలుగు ప్రజలకు చంద్రబాబు సంక్రాంతి విషెస్... ఊరెందుకెళ్తున్నారంటే..?
X

ప్రస్తుతం ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి సందడి మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఈ పండకకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నగరాలు, పట్టణాలు వదిలి ప్రజలంతా సొంతూర్లకు బయలుదేరారు. ఈ సమయంలో సంక్రాతికి ఊరు వెళ్లడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే ఎక్కడెక్కడో ఉన్న బందువులు, స్నేహితులు అంతా ఒక్క చోట చేరేలా ప్రణాళికలు రచించి, వాటిని అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా... ప్రజలందరిలోనూ ఈ సంక్రాంతి కొత్త వెలుగులు నింపాలని, ఆనందాలు కలిగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. పండుగ సమయంలో ప్రజలంతా ఊరు వెళ్లి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అందరితోనూ సంతోషంగా గడపాలని కోరారు. అందుకే తాను కూడా ప్రతీ సంక్రాంతికీ ఊరికి వెళ్తున్నట్లు సీఎం వెల్లడించారు.

ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... పండగ సమయంలో తమ తమ ఊర్లకు వెళ్లి నలుగురితో కలవటాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని.. తాను కూడా అందుకే ప్రతి సంక్రాంతికి తమ ఊరికి వెళ్తానని చెప్పారు. ఇదే క్రమంలో... తాను ప్రతీ సంక్రాంతికీ ఊరు వెళ్లే సంప్రదాయానికి తన భార్య భువనేశ్వరే కారణం అని చంద్రబాబు తెలిపారు.

ఇందులో భాగంగా... సుమారు పాతికేళ్ల క్రితం భువనేశ్వరి పట్టుబట్టి మొదలుపెట్టిన ఈ సంప్రదాయాన్నే తాను క్రమం తప్పకుండా పాటిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో... ఈ రోజుల్లో మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయని.. అందువల్ల పండుగ సమయాల్లో అయినా అంతా కలవటం, మాట్లాడుకొవడం ఎంతో అవసరం అని చంద్రబాబు తెలిపారు.

ఇదే సమయంలో... మనం ఆనందంగా పండగ చేసుకోవడమే కాకుండా.. ఊర్లో ఉన్న పేదవారు కూడా ఆనందంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని.. వారికి చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మిగిలినవారిపై ఉందని.. ఈ విధానాన్ని ప్రోత్సహించడానికే పీ4 కాన్సెప్ట్ పేపర్ ను ఆదివారం (12 జనవరి) విడుదల చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.