Begin typing your search above and press return to search.

' ఉచిత గ్యాస్ ' మైలేజీ పై చంద్ర‌బాబు ఆవేద‌న రీజ‌నేంటి..!

మ‌రో కీల‌క హామీల్లో ఒక‌టైన‌.. ఉచిత గ్యాస్ ప‌థ‌కాన్ని గ‌త ఏడాది డిసెంబ‌రు నుంచి అమలు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 Jan 2025 8:10 AM GMT
 ఉచిత గ్యాస్  మైలేజీ పై చంద్ర‌బాబు ఆవేద‌న రీజ‌నేంటి..!
X

రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల‌ను అమ‌లు చేయ‌డంపై దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగానే మెగా డీఎస్సీని ప్ర‌క‌టించారు. కానీ, ఇది తొలినాళ్ల‌లో ఇచ్చిన మైలేజీ.. త‌ర్వాత త‌ర్వాత త‌గ్గుతూ వ‌చ్చింది. మెగా డీఎస్పీని ప్ర‌క‌టించారే త‌ప్ప‌.. ఏడు మాసాలు పూర్తి అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌లేకపోయారు. దీంతో నిరుద్యోగుల్లో తొలినాళ్ల‌లో ఉన్న సంతృప్తి ఇప్పుడు త‌గ్గుతూ వ‌చ్చింది.

ఇక‌, మ‌రో కీల‌క హామీల్లో ఒక‌టైన‌.. ఉచిత గ్యాస్ ప‌థ‌కాన్ని గ‌త ఏడాది డిసెంబ‌రు నుంచి అమలు చేస్తున్నారు. అర్హులైన ప్ర‌తి కుటుంబానికి ఏడాదికి 3(ప్ర‌తి నాలుగు మాసాల‌కు ఒక‌టి) గ్యాస్ సిలిండ‌ర్ల‌ను ఇచ్చే ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఇది మ‌హిమ‌ణుల ఆనందానికి దారి తీస్తుంద‌ని.. త‌ద్వారా కూట‌మి స‌ర్కారు కు మైలేజీ తీసుకువ‌స్తుంద‌ని పార్టీ నాయ‌కులు ఆశించారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు స‌హా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కూడా ఆశ‌లు పెట్టుకున్నారు.

ప‌థ‌కం అయితే ప్రారంభించారు. కానీ, 50 రోజుల త‌ర్వాత‌.. దీనిపై జ‌రిగిన స‌మీక్ష‌, త‌ర్వాత‌... వ‌స్తున్న ఫీడ్ బ్యాక్ విష‌యం మాత్రం ప్ర‌భుత్వాన్ని ముఖ్యంగా చంద్ర‌బాబును సైతం డోలాయ‌మానంలో ప‌డేశాయి. ఈ విష‌యంపై మంత్రులు సైతం ఆందోళ‌న‌గానే ఉన్నారు. పోయే సొమ్ము పోతున్నా.. కావాల్సిన, రావాల్సిన మైలేజీ మాత్రం రావ‌డం లేద‌న్న‌ది వారు చెబుతున్న మాట‌. దీనికి కార‌ణం.. ప్ర‌జ‌లు ముందుగా డ‌బ్బులు చెల్లించి సిలిండ‌ర్ తీసుకోవ‌డం ఒక కార‌ణం.

ఇక‌, రెండోది .. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న త‌ప్పుల కార‌ణంగా.. ల‌బ్ధిదారుల‌కు చాలా మందికి ఇప్ప‌టికీ సిలిండ‌ర్ సొమ్ములు వారి ఖాతాల్లో జ‌మ కాక‌పోవ‌డం.. పైగా.. నేరుగా మీకు ఇంత ల‌బ్ధి చేకూరింద‌ని ప్ర‌భుత్వం చెప్పుకోలేకపోవ‌డంతో ఈ ప‌థ‌కం నీరు గారుతోంద‌ని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం పై పార్టీలోను.. సీఎం స్థాయిలోనూ ఆందోళ‌న ఉంది. దీనికి విరుగుడుగా .. కేంద్రం పెట్టిన నిబంధ‌నలు (ముందుగానే సొమ్ములు చెల్లింపు) తీసివేయాల‌ని ఆలోచ‌న చేస్తున్నారు. కానీ.. కేంద్రం ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ‌డంతో చంద్ర‌బాబు ఆవేద‌న‌తో ఉన్నార‌న్న‌ది సీఎంవో వ‌ర్గాల స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.