Begin typing your search above and press return to search.

నాలుకలకు తాళం వేస్తా.. జగన్ చెవికి జీవో కట్టి తిప్పుతా.. చంద్రబాబు ఫైర్

అమరావతిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాలుకలకు తాళాలు వేయాల్సి వస్తోందన్న ఆయన.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   18 Sep 2024 4:29 AM GMT
నాలుకలకు తాళం వేస్తా.. జగన్ చెవికి జీవో కట్టి తిప్పుతా.. చంద్రబాబు ఫైర్
X

తన తీరుకు భిన్నంగా మాట్లాడారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాలుకలకు తాళాలు వేయాల్సి వస్తోందన్న ఆయన.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌమ్యంగా.. పాలిష్డ్ గా మాట్లాడితే చెవికి ఎక్కటం లేదన్న ఆయన.. సీరియస్ అయ్యారు. తనకు ఏ మాత్రం సూట్ కాని మాటలతో నిప్పులు చెరిగిన ఆయన.. ‘‘మీకు మర్యాదగా చెబితే చెవిక్కెడం లేదు. రాజధాని అమరావతి గురించి మరోసారి తప్పుగా మాట్లాడితే నాలుకలకు తాళాలు వేయాల్సి వస్తుంది. తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ అసహ్యమైన రాజకీయాలు చేస్తారా?’’ అంటూ విరుచుకుపడ్డారు.

భారీ వర్షాలు.. వరదలకు రాష్ట్రం అతలాకుతలం అయితే వైసీపీ నేతలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని.. బాధితులకు కనీసం సాయం చేసేందుకు ముందుకు రాలేదన్నారు. కుట్రపూరితంగా బోట్లు విడిచి పెట్టి ప్రకాశం బ్యారేజీని కూల్చాలనుకున్నారన్నారు. వైసీపీ నేతల్ని అదుపు తప్పిన ఏనుగులుగా అభివర్ణిస్తూ (ఇక్కడ ఇంగ్లిష్ లో రోగ్ ఎలిఫెంట్స్ గా పేర్కొన్నారు).. ‘‘మీకు ఏం చేయాలో అది చేసి చూపించాల్సిందే. రేపు అదే జరుగుతుంది. రాజధాని అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ మేధావుల్ని చెన్నై.. బెంగళూరు.. ముంబయి.. హైదరాబాద్ లను కూడా మార్చేయమనండి. వాళ్ల ఇంటికి నీళ్లు వస్తాయని ఆకాశం మీదకు పోతారా? హుద్ హుద్ తుపానుకు విశాఖ ఏమైంది? తిరుపతి.. నెల్లూరు.. కర్నూలుకు వరదలు రాలేదా? ఆ మాటకు వస్తే ఏ నగరం సురక్షితం? పోనీ పులివెందులలో రాజధాని పెడితే సురక్షితమా?’’ అంటూ నిప్పులు చెరిగారు.

ప్రైవేటు వైద్య కాలేజీల జీవోను ఒకసారి చూస్తే అర్థమవుతుందని.. తమ తప్పు ఏమీ లేదన్న చంద్రబాబు.. ‘‘ఆ జీవోను జగన్ చెవికి కట్టి రాష్ట్రమంతా తిప్పుతా. అప్పుడే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి’’ అంటూ మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ ను పలు రకాలుగా విమర్శించిన చంద్రబాబు.. కాకినాడ జిల్లాలో సంభవించిన వరదలకు నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్.. కనీసం నీళ్లలో కూడా దిగలేదన్నారు.

‘‘బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లి కనీసం నీళ్లలోకి దిగారా? బురదలో దిగేందుకు ఆలోచించేవాళ్లు ప్రజాస్వామ్యంలో నాయకులుగా పనికొస్తారా? ఒక పేపరు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తూ బతికిపోవాలనుకుంటున్నారు. వారి ఆటలు సాగవని చెప్పటానికే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ప్రజలు బాధల్లో ఉంటే పుండు మీద కారం చల్లినట్లుగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు’’ అంటూ మండిపడ్డారు.

విశాఖ ఉక్కు కర్మాగారం మీద వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రజల్ని రెచ్చగొడుతున్నారన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారైనా స్టీల్ ప్లాంట్ పై మాట్లాడారా? అని ప్రశ్నించిన చంద్రబాబు.. ఢిల్లీ వెళదామని తాను పిలిస్తే స్పందించలేదన్నారు. స్టీల్ ఫ్లాంట్ ప్రస్తుత దుస్థితికి వైసీపీ నేతలే ప్రధాన కారణమన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగకుండా తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందన్నారు. తాను ఈ రోజు కూడా విశాఖ ఉక్కు గురించి కేంద్ర మంత్రి కుమారస్వామి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో మాట్లాడానని.. విశాఖ ఉక్కుకు కొంత నిధులు విడుదల చేయనున్నట్లుగా చెప్పారు.