జగన్ సింపతీ పాలిటిక్స్ పై బాబు సెటైర్లు
ఏపీలో లా అండ్ ఆర్డర్ పై అసెంబ్లీ సమావేశాలలో వాడీవేడీ చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Nov 2024 5:49 PM GMTఏపీలో లా అండ్ ఆర్డర్ పై అసెంబ్లీ సమావేశాలలో వాడీవేడీ చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించే విషయంలో వెనకాడబోమని, మారు మూల ప్రాంతంలో తప్పు చేయాలన్నా భయపడాలని హెచ్చరించారు. గంజాయి తీసుకోవాలంటే భయపడాలి...ఆడపిల్లల మీద చేయి వేయాలంటే భయపడాలి...వారికి అదే చివరి రోజు...అంటూ చంద్రబాబు భావోద్వేగంతో మాట్లాడారు.
ఇక, విశాఖలో లా స్టూడెంట్ గ్యాంగ్ రేప్ ఘటనపై కూడా చంద్రబాబు ఎమోషనల్ గా మాట్లాడారు. ఆ అమ్మాయి నగ్న ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి గ్యాంగ్ రేప్ చేశారని, వారు మృగాలని మండిపడ్డారు. ఆ పనులు చూస్తుంటే చాలా బాధ, ఆవేదన వేస్తోదంని చెప్పారు. కొన్ని సార్లు చట్టం మన చేతులు కట్టేస్తోందని, బాధ్యతను గుర్తు చేస్తుందని భావోద్వేగంతో మాట్లాడారు. చిన్న పిల్లలపై మత్తు మందు ఇచ్చి అఘాయిత్యాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, ఎన్నికల ముందు సింపతీ డ్రామాలు ఏంటి అని జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ కోడికత్తి డ్రామా ఆడారని, ఆ కేసులో నిందితుడు చాలా రోజులు జైల్లోనే ఉన్నాడని అన్నారు. ఇక, 2024 ఎన్నికలకు ముందు జగన్ గులకరాయి డ్రామా ఆడారని గుర్తు చేశారు. ఈ రకమైన సానుభూతి రాజకీయాలు చేయడం ఏంటని సెటైర్లు వేశారు. తన జీవితంలో చాలామంది రాజకీయ నాయకులను చూశానని....జగన్ వంటి వారిని చూడలేదని అన్నారు. రాజకీయ ముసుగులో నేరస్తులు రాజకీయాలు చేస్తే ఆ ముసుగు తీసి వారిని నేరస్తులుగా నిలబెడతానని వైసీపీ నేతలకు చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు.