Begin typing your search above and press return to search.

అయిదేళ్ల సీఎంనే అంటున్న బాబు!

ఏపీ సీఎం తెలుగుదేశం చీఫ్ నారా చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికల పట్ల వ్యతిరేకంగా ఉన్నారా అంటే అవును అనే అంటున్నారు.

By:  Tupaki Desk   |   3 Nov 2024 4:13 AM GMT
అయిదేళ్ల సీఎంనే అంటున్న బాబు!
X

ఏపీ సీఎం తెలుగుదేశం చీఫ్ నారా చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికల పట్ల వ్యతిరేకంగా ఉన్నారా అంటే అవును అనే అంటున్నారు. నిజానికి చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉన్నపుడు కూడా ఆనాడు కేంద్రంలో పవర్ లో ఉన్న బీజేపీ జమిలి ఎన్నికలు అంటూ రాగాలాపన చేసింది. అయితే దానికి టీడీపీ మద్దతు ఇస్తుందా అన్న చర్చ కూడా అప్పట్లో వచ్చింది.

ఆనాడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఒక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ తమకు ప్రజలు అయిదేళ్ల పాటు పాలించమని మ్యాండేట్ ఇచ్చారని అందువల్ల తాము పూర్తి కాలం ఉంటామని అందులో ఒక్క రోజు కూడా వదులుకోమని స్పష్టం చేశారు. దాన్ని చూసిన వారు జమిలి ఎన్నికల మీద టీడీపీ స్టాండ్ అదే అనుకున్నారు.

ఇక ఇపుడు చూస్తే 2024 ఎన్నికలు అయ్యాక ఫలితాలు వచ్చి కేంద్రంలో మోడీ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాలు ఏర్పడ్డాక మరోసారి జమిలి ఎన్నికల మీద చర్చ అయితే సాగుతూ వస్తోంది. లేటెస్ట్ గా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల వేళ స్పష్టంగా చెప్పారు.

అంటే కేంద్రం ఆలోచనలు అయితే అలాగే ఉన్నాయని అంటున్నారు. కానీ ఏపీలో టీడీపీ ఆలోచనలు దానికి మద్దతుగా సాగుతున్నాయా అంటే ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేస్తున్నారు. అయితే ఏపీలో అయిదేళ్ల పాటు కొనసాగడానికే టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, అమరావతి రాజధాని ఒక రూపూ షేపూ రావాలి. అభివృద్ధి అన్నది జనాలకు చూపించాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలి. సంక్షేమం అభివృద్ధి అన్నది జనాలకు చూపించి ఓట్లకు మళ్ళీ వెళ్తేనే క్రెడిబిలిటీ ఉంటుందని టీడీపీ భావిస్తోంది. తమకు అయిదేళ్ళు ప్రజలు ఇచ్చారని, ఇవన్నీ చేసేందుకు ఆ సమయం సరిగ్గా వాడుకుంటామని అంటోంది.

ఈ మధ్యలో ఎన్నికలు అంటే కనుక ఏ విధంగానూ ఏ కార్యక్రమం పూర్తి కాకుండా జనం వద్దకు వెళ్ళడం జరుగుందని అది ఇబ్బందికరం కావడమే కాకుండా మొత్తం జమిలి వ్యూహమే బూమరాంగ్ అవుతుందని కూడా ఆలోచిస్తోంది అని ప్రచారం అయితే సాగుతోంది. మరో వైపు చూస్తే జమిలి అంటే జాతీయ అంశాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. మూడు సార్లు అధికారంలో ఉన్న బీజేపీ మీద ఏమైనా వ్యతిరేకత ఉంటే అది ఏపీలో తమ సానుకూలతను దెబ్బ తీస్తుందని ఆలోచన కూడా టీడీపీకి ఉందని కూడా ప్రచారంలో ఉందిట.

ఇవన్నీ పక్కన పెడితే విశాఖ పర్యటనలో భాగంగా రుషికొండను సందర్శించిన బాబు మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రశ్నకు జవాబు ఇస్తూ తాను పద్నాలుగేళ్ల పాటు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పారు. ఇపుడు నాలుగవ సారి సీఎం గా ఉన్నాను అని 2029కి తాను సీఎం గా 19 ఏళ్ళు కంప్లీట్ చేస్తాను అని చెప్పారు.

దానిని బట్టి చూస్తే కనుక చంద్రబాబు తన టెన్యూర్ ని ఏ మాత్రం తగ్గించుకోరు అనే అంటున్నారు. పైగా తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కాలం సీఎం గా పాలించిన రికార్డు అయితే ఈ రోజుకీ బాబుదే. అది కాస్తా 2029 నాటికి 19 ఏళ్ళు అవుతుంది. సమీప భవిష్యత్తులో ఆ రికార్డుని ఎవరూ బ్రేక్ చేయకుండా ఉండాలంటే అంతటి సుదీర్ఘ కాలం పాలించాల్సిందే అన్నది కూడా ఉంటుంది కదా.

మొత్తం మీద చూస్తే చంద్రబాబు క్యాజువల్ గా అన్నారా లేక మనసులో నుంచి వచ్చినా అన్నది పక్కన పెడితే 2029లోనే ఎన్నికలు అని టీడీపీ నేతలు మాత్రం గట్టిగా ఫిక్స్ అవుతున్నారు. పైగా జమిలి ఎన్నికలు అని కేంద్రం అనుకున్నా అది ఆచరణ సాధ్యం కాదని కూడా చాలా మంది భావనగా ఉందిట. సో అదన్న మాట మ్యాటర్.