2020 రిపీట్... జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించి మరో కీలక ముందడుగు పడిందని అంటున్నారు. దీనికి సంబంధించిన బిల్లుకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
By: Tupaki Desk | 14 Dec 2024 9:29 AM GMTదేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించి మరో కీలక ముందడుగు పడిందని అంటున్నారు. దీనికి సంబంధించిన బిల్లుకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లును ఈ నెల 16న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... జమిలి ఎన్నికల విధానం అమల్లోకి వచ్చినా 2029లోనే ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన... ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని అన్నారు. జమిలీపై అవగాహన లేని నేతలు ఏది బడితే అది మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.
ఈ సందర్భంగా... రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు తెలిపారు. స్కూల్స్ నుంచి మొదలు యూనివర్శిటీ వరకూ దీనిపై చర్చ జరగాలని అన్నారు. ఇదే సమయంలో విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలన్నారు.
ఇదే సమయంలో... 2020 తరహాలోనే 2047లోనూ అదే పునరావృతం అవుతుందని బాబు చెప్పుకొచ్చారు. ఇక.. స్వర్ణాంధ్ర విజ 2047 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసే కార్యక్ర్మం కాదని చెప్పిన చంద్రబాబు.. భవిష్యత్ తరాల బాగుకోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో.. ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తామని.. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు-సమాధానాల రూపంలో నిర్వహిస్తామని.. ఈ మేరకు ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చించే అంశాలు పంపి.. సమాధానాలు కోరతామని సీఎం తెలిపారు.
ఏది ఏమైనా... జమిలీ అమల్లోకి వచ్చినా కూడా ఎన్నికలు జరిగేది 2029లోనే అని చంద్రబాబు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుందని అంటున్నారు.