Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేకు బాబు రెడ్ సిగ్నల్ ?

టీడీపీలో ఒకప్పటి క్రమశిక్షణను పాదుకొలపాలని అధినేత హోదాలో చంద్రబాబు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Sep 2024 3:31 AM GMT
ఆ ఎమ్మెల్యేకు బాబు రెడ్ సిగ్నల్ ?
X

టీడీపీలో ఒకప్పటి క్రమశిక్షణను పాదుకొలపాలని అధినేత హోదాలో చంద్రబాబు చూస్తున్నారు. ఆయన ఆలోచనలు అలాగే సాగుతాయి. పార్టీ ఇన్నేళ్ళ పాటు ఈ విధంగా పటిష్టంగా ఉంది అంటే దానికి బాబు వేసిన బాటలే కారణం. టాప్ టూ బాటం ఎప్పటికపుడు చెక్ చేసుకుంటూ వెళ్ళడం బాబుకు అలవాటు.

అదే తీరున ఆయన ఇపుడు కూడా బ్రహ్మాండమైన సంఖ్యలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో ఒక కన్ను పెడుతున్నారు. చంద్రబాబు తరచూ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలు మంత్రులు పార్టీ నేతలు అంతా క్రమశిక్షణగా ఉండాలని హిత బోధ చేస్తూనే ఉన్నారు.

అంతే కాదు ప్రతీ ఒక్కరి ప్రోగ్రెస్ రిపోర్ట్ ని కూడా ఆయన రెడీ చేసి ఉంచుతున్నారు. అయితే పార్టీలో కొత్తగా చేరిన వారు అవకాశాలు ఇస్తే అందుకున్న వారితో బాబుకు కొన్ని సమస్యలు వస్తున్నాయి. అటువంటి వారిలో తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు ఒకరుగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత వివాదాలకు కొంత అవకాశం ఇస్తున్నారు అని చర్చ సాగింది.

ఇపుడు చూస్తే ఏకంగా ఆయన మీద మీడియా ప్రతినిధులే ముఖ్యమంత్రి చంద్రాబాబుకు ఫిర్యాదు చేసే పరిస్థితి ఏర్పడింది. వారంతా ప్రత్యేకంగా తిరువూరు నుంచి వచ్చి మరీ చంద్రబాబును కలిశారు. మీ ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పడంతో పాటు ఆఖరుకు మీడియాను సైతం బెదిరిస్తున్నారు అని కూడా ఘాటైన ఫిర్యాదునే చేశారు.

మీడియా ప్రతినిధులను కించపరచేలా వ్యవహరిస్తున్నారు అని కూడా వారు చెప్పారు. తమను కొలికపూడి బెదిరిస్తున్నారు అంటూ కొన్ని ఆధారాలను కూడా వారు చంద్రబాబుకు చూపించారు. ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలని వారు ముక్తకంఠంతో బాబుని కోరారు.

మీడియా ప్రతినిధులు అంటే అమితంగా ఇష్టపడి గౌరవించే వారిలో చంద్రబాబు ముందుంటారు. ఆయన మీడియా నుంచి ఏ విధంగా ఫిర్యాదు వచ్చినా అసలు సహించరు. అందుకే బాబు ఈ విషయంలో సానుకూలంగా స్పందించారు. పైగా తనకు అన్ని విషయాలూ తెలుసు అని కూడా చెప్పడం విశేషం.

తాను వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాను అని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరి బాబు సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు అన్నదే అందరి దృష్టిలో ఉంది. బాబు ఈ వ్యాఖ్యలు మీడియా ప్రతినిధుల వద్ద చేశారు అంటే రెడ్ సిగ్నల్ పడినట్లే అంటున్నారు. సదరు ఎమ్మెల్యేకు చెప్పాల్సింది చెప్పి ఇక మీదట చేయవద్దు అని స్పష్టం చేస్తారా లేక అంతకంటే కఠినంగా వ్యవహరిస్తారా అన్న చర్చ కూడా ఇపుడు సాగుతోంది.

ఇదిలా ఉంటే ఉద్యమ నాయకుడిగా పేరు ఉన్న కొలికపూడి ఎమ్మెల్యే అయ్యాక బాగా మారిపోయారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఆయన అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొని బాబుకు దగ్గర అయ్యారు. దాంతో బాబు ఆయనకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. తిరువూరు సీటుని ఆశించిన సీనియర్ నేతలు జవహర్ వంటి వారిని సైతం బాబు పక్కన పెట్టి కొలికపూడికి చాన్స్ ఇచ్చారు.

ఇక కూటమికి వీచిన భారీ ప్రభంజనంలో కొలికపూడి గెలిచారు. అయితే ఎమ్మెల్యే కాగానే ఒక అక్రమమైన ఇంటిని కూల్చేందుకు ఆ ఇంటి వద్దకే వచ్చి కుర్చీ వేసుకుని మరీ వచ్చిన తీరు కూడా అప్పట్లో విమర్శల పాలు అయింది. ఆ ఘటన తరువాత ఒకసారి చంద్రబాబు ఆయనను పిలిచి క్లాస్ తీసుకున్నారు అన్న చర్చ కూడా ఉంది.

అయితే ఆయన కొన్నాళ్ళు తగ్గినట్లు కనిపించినా మళ్లీ దూకుడు చేస్తున్నారు అని అంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఆయన ఇబ్బందిగా మారుతున్నారు అన్న మాట కూడా ఉంది. ఈ క్రమంలో ఆయన మరిన్ని వివాదాల్లో చిక్కుకున్నారని అంటున్నారు. దాంతో పాటు మీడియా ప్రతినిధులే ఫిర్యాదు చేయడంతో బాబు ఆయన మీద ఏ రకమైన యాక్షన్ తీసుకుంటారు అన్నది చర్చగా ఉంది.