నాగబాబు విషయంలో చంద్రబాబు పునరాలోచన? కూటమిలో కీలక పదవి!
ఏపీలో కీలక రాజకీయ నిర్ణయం తీసుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 4 Feb 2025 11:30 PM GMTఏపీలో కీలక రాజకీయ నిర్ణయం తీసుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న అన్న నాగబాబు విషయంలో సీఎం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజ్యసభ స్థానాన్ని ఆశించిన నాగబాబుకు బీజేపీ అడ్డుగా వచ్చింది. ఆ సందర్భంలో ఆయనను మంత్రి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ ఆలోచనలో మార్పు వచ్చిందని.. కూటమిలో నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించాలని చెబుతున్నారు.
నేడో రేపో నాగబాబు మంత్రి కాబోతున్నారని అంతా ఎదురుచూస్తుండగా, ఆయన విషయంలో సీఎం చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు రాజధాని రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. జనసేన సోషల్ మీడియాలో కూడా ఈ విషయమై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెద్దన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టినప్పటి నుంచి నాగబాబు క్రియాశీల రాజకీయాల్లోనే ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కొన్నాళ్లు ఆయన సైలెంట్ అయ్యారు. ఇక తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన స్థాపించిన నుంచి ఆయన ఆ పార్టీలో పనిచేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన ఆయన ఇప్పుడు చట్టసభలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. తన ఇద్దరు సోదరులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేయడంతో తానుకూడా ఆ ముచ్చట తీర్చుకోవాలని భావించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని అనకాపల్లిలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. అయితే ఆఖరి క్షణంలో ఆయన ఆశలపై బీజేపీ నీళ్లు పోసింది. ఆ తర్వాత జనసేన తరపున రాజ్యసభకు వెళ్లాలని భావించారు. వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయగా, అందులో ఒక స్థానాన్ని ఆశించారు. అయితే మూడు స్థానాలకు టీడీపీ రెండు తీసుకుని, బీజేపీకి ఒకటి వదిలేసింది. దీంతో నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కొద్దిరోజుల్లో ఆయన మంత్రి అవుతారని అంతా ఆశిస్తుండగా, ఈ ప్రతిపాదనలో చిన్న మార్పు వచ్చిందని చెబుతున్నారు.
రాష్ట్రంలో కూటమి పాలన మొదలై 8 నెలలు అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, యువనేత లోకేశ్ పరిపాలన వ్యవహారాల్లో బిజీబిజీగా ఉంటున్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా రాష్ట్ర రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో కూటమిలో చిన్నచిన్న తగాదాలు చోటుచేసుకుంటున్నాయి. కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీల వరకు కూటమిలో సమన్వయం లోపిస్తోంది. దీంతో అధినేతలే కల్పించుకోవాల్సివస్తోంది. చిన్న చిన్న సమస్యలకు కూడా జిల్లా స్థాయిలో పరిష్కారం లభించడంలేదు. ఇవి ఇలానే వదిలేస్తే చిలికిచిలికి గాలివానలా మారే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భయపడుతున్నట్లు చెబుతున్నారు. దీంతో కూటమిలో మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన మధ్య సమన్వయానికి ఒకరికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. అయితే ఈ పనిని ఇతర నేతలు కాకుండా అయితే లోకేశ్, లేదంటే నాగబాబు చూడాలని ప్రతిపాదిస్తున్నారని తెలుస్తోంది. మంత్రిగా లోకేశ్ కీలక బాధ్యతల్లో ఉన్నందున నాగబాబుకే సమన్వయ బాధ్యతలు అప్పగించి, రెండు పార్టీల మధ్య వారధిగా ఆయన సేవలు ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొద్దిరోజులుగా ఈ విషయమై జనసేన సోషల్ మీడియాలో కూడా ఓ వార్త షికారు చేస్తోంది.
అయితే ఇప్పటికే నాగబాబును మంత్రిని చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినందున.. జనసేన అధినేత పవన్ తోపాటు నాగబాబు అభిప్రాయం కూడా తెలుసుకోవాలని టీడీపీ పెద్దలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. నాగబాబుకు మంత్రి బదులుగా వైసీపీ ఎంపీ విజయసాయి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ నుంచి రాజ్యసభకు పంపాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఎలాగూ నాగబాబుకు రాజ్యసభకు వెళ్లడంపై ఆసక్తి ఉన్నందున అటువైపు నుంచి అభ్యంతరం వ్యక్తం కాదని భావిస్తున్నారు. నాగబాబు మంత్రి పదవి కావాలంటే భవిష్యత్తులో కచ్చితంగా ఇస్తామని హామీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం కూటమి సమన్వయానికి పెద్ద నాయకుడు అవసరం ఉన్నందున ఆ బాధ్యతలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతున్నట్లు చెబుతున్నారు. జనసేన సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం నిజమైతే త్వరలో నాగబాబు ఎంపీ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.