Begin typing your search above and press return to search.

'పింఛ‌ను' గ్రాఫ్‌.. ప‌డుతోందా... చంద్ర‌బాబు ఆరా.. !

వృద్ధులు, వితంతు పింఛ‌న్ల‌కు మాత్రం రూ.4000 చొప్పున రెండు నెల‌ల బ‌కాయి క‌లిపి ఇచ్చారు. దీంతో ఇత‌ర ప‌థ‌కాల‌ను ఆల‌స్యం చేసినా పెద్ద‌గా మైన‌స్ కాలేదు.

By:  Tupaki Desk   |   27 Dec 2024 4:32 AM GMT
పింఛ‌ను గ్రాఫ్‌.. ప‌డుతోందా...  చంద్ర‌బాబు ఆరా.. !
X

ఏపీలో కూట‌మి అధికారంలోకి వ‌చ్చేందుకు కీల‌క‌మైన ప‌లు హామీల్లో ఒక‌టి పింఛ‌న్ల పెంపు. ఈ ఏడాది మే వ‌ర‌కు రూ.3000లుగా ఉన్న సామాజిక భ‌ద్ర‌తా పించ‌న్‌ను రూ.4000ల‌కు పెంచారు. ఇదే స‌మ‌యంలో దివ్యాంగుల‌కు రూ.3000 వేలుగా ఉన్న పింఛ‌ను ఏకంగా ఆరు వేల‌కు పెంచారు. ఈ రెండు కూడా.. స‌ర్కారు ఏర్ప‌డేందుకు.. దోహ‌ద‌ప‌డ్డాయి. అనుకున్న‌ట్టుగానే చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వీటిని అమ‌లు చేశారు. దివ్యాంగుల‌కురెండు నెల‌ల బ‌కాయి ఇవ్వ‌లేదు.

కానీ, వృద్ధులు, వితంతు పింఛ‌న్ల‌కు మాత్రం రూ.4000 చొప్పున రెండు నెల‌ల బ‌కాయి క‌లిపి ఇచ్చారు. దీంతో ఇత‌ర ప‌థ‌కాల‌ను ఆల‌స్యం చేసినా పెద్ద‌గా మైన‌స్ కాలేదు. చంద్ర‌బాబు ప్ర‌తి నెలా 1వ తేదీనే పింఛ‌న్ల ను ఇవ్వ‌డం. అవి కూడా ఇంటికే పంపించ‌డం.. తానే స్వ‌యంగా ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి పింఛ‌న్ల‌ను పంపిణీ చేయ‌డం వంటివి చంద్ర‌బాబుకు మంచి మార్కులు ప‌డేలా చేశాయి. ఇత‌ర సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను కొంత ఆల‌స్యం చేసినా పెద్ద‌గా ఎఫెక్ట్ అయితే క‌నిపించ‌లేదు.

కానీ, ఇప్పుడు ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. పింఛ‌న్ గ్రాఫ్ ప‌డిపోతోంది. అన‌ర్హులైన వారిని తొల‌గించే కార్య‌క్ర‌మానికి సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే శ్రీకారం చుట్టాల‌ని చెప్పడంతో రూ.4000 తీసుకుంటున్న వారిలో ఎక్క‌డా సంతోషం క‌నిపించ‌డం లేదు. నిజానికి అనర్హులు ఉన్న మాట వాస్త‌వ‌మే అయినా.. ఇంత పెద్ద ప్ర‌భుత్వం రూ.4 వేలు ఇవ్వ‌లేక‌పోతోందా? అనే మేధావుల ప్ర‌శ్న‌లు కూడా.. స‌ర్కారుకు ఇబ్బందిగానే మారాయి. మ‌రోవైపు.. ఈ నెల పింఛ‌న్ వ‌స్తుందా? రాదా? అనే సందేహాలు కూడా ముసురుకున్నాయి.

ఈ ప‌రిస్థితి సాధార‌ణంగా.. పేద‌ల‌కు ఇబ్బందిగానే మారింది. అయితే.. కొత్త వారికి ఇవ్వాల‌న్న క్షేత్ర‌స్థాయి లో త‌మ్ముళ్ల ఒత్తిళ్లు పెరిగాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో చాలామంది ఇళ్ల‌కు వెళ్లి ఓట్లు అబ్య‌ర్థించారు. ఈ స‌మ‌యంలో వారు చాలా మందికి పింఛ‌న్ల హామీ ఇచ్చారు. ఇప్పుడు అవి నెరవేర్చాల్సి ఉంది. దీంతోనే ఏరివేత కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. కానీ, ఇది బెడిసి కొట్టే అవ‌కాశం ఉంద‌ని స్ప‌స్టంగాతెలుస్తోంది. మ‌రోవైపు.. తాము అంద‌రికీ ఇచ్చామ‌ని.. ఇప్పుడు ఎందుకు తొల‌గిస్తున్నార‌ని వైసీపీ కూడా యాగీ చేస్తోంది. మొత్తంగా చూస్తే.. పింఛ‌న్ల పెంపుతో కూట‌మి స‌ర్కారుకు వ‌చ్చిన గ్రాఫ్ పింఛ‌న్ల ఏరివేత‌తో పోయే ప్ర‌మాదం అయితే.. ఏర్ప‌డింద‌న‌డంలో సందేహం లేదు.