ఏపీలో పదవీ బాధితులకు భరోసా దక్కేనా ..!
ఈ నేపథ్యంలో చంద్రబాబు పదవుల విషయంలో ఎవరికి ఏది ఇవ్వాలనే విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.
By: Tupaki Desk | 9 Dec 2024 1:30 AM GMTనామినేటెడ్ పదవులు ఆశించిన వారు వందల్లో ఉన్నారు. ఇక, తాజాగా భర్తీ అయ్యే రాజ్యసభ సీట్లకు పోటీ పడిన వారు కూడా ఉన్నారు. అయితే.. వాసి తక్కువగా ఉండడం.. రాసి ఎక్కువగా ఉండడంతో ఈ పదవుల విషయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆశించిన అందరికీ పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే.. ఇదే క్రమంలో వైసీపీ నుంచి వచ్చిన వారికి కాదనలేని పరిస్థితి కూడా నెలకొంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు పదవుల విషయంలో ఎవరికి ఏది ఇవ్వాలనే విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఇటీవల నామినేటెడ్ పదవుల జాబితాలు రెండువిడుదల చేసినా.. వాటిని కూడా చాలా రహస్యంగా రాత్రికి రాత్రి విడుదల చేసి.. నాయకులను కంట్రోల్ చేశారు. కానీ, కీలకమైన పదవులు ఇంకా ఉన్నాయి. వీటిని ఆశిస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. పైగా ఈ ఏడాది ఎన్నికల్లో టికెట్లు వదులుకుని పార్టీకి సహకరించిన వారు కూడా ఉన్నారు.
వర్మ, దేవినేని ఉమా సహా.. అనేక మంది పార్టీ సీనియర్లు పదవులు వదలుకున్నారు. దీంతో వీరంతా పదవుల కోసం వేచి ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో వీరికి అవకాశం రాలేదు. ఇక, ఇప్పుడు కళ్లముందు కనిపిస్తున్న మూడు రాజ్యసభ సీట్ల విషయంలోనూ ఇదే తంతు నడుస్తోంది. దీంతో నాయకులు తల్లడిల్లుతున్నారు. టికెట్లు త్యాగం చేసినా..తమకు భరోసా దక్కలేదన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో వారు రెబల్‌గా మారే అవకాశం లేకపోయినా.. పార్టీకి దూరంగా ఉంటారన్న అంచనాలు మాత్రం వస్తున్నాయి. ఒకవైపు.. వచ్చే ఏడాది లేదా.. ఆ పై ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరోవైపు.. జమిలి వస్తే.. దానిని కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. అప్పుడు ఈ నాయకుల అవసరం పార్టీకి ఉంటుంది. దీనిని గమనిస్తున్న చంద్రబాబు వారికి చెప్పలేక.. పదవులు సర్దుబాటు చేయలేక సతమతం అవుతున్నారన్నదిపరిశీలకులు చెబుతున్న మాట. దీంతో పదవులు కోల్పోయిన వారికి భరోసా దక్కడం కూడా కష్టంగా మారింది.