రోజా అరెస్టు? చంద్రబాబు నిర్ణయమే పెండింగ్!!
వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్ రోజాపై అరెస్టు కత్తి వేలాడుతోందా? అనే ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
By: Tupaki Desk | 7 Feb 2025 2:58 PM GMTవైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్ రోజాపై అరెస్టు కత్తి వేలాడుతోందా? అనే ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. గత రెండు రోజులుగా రాజధాని అమరావతిలో ఈ విషయంపైనే హాట్ డిబేట్ నడుస్తోంది. ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో అప్పటి మంత్రి రోజా అవినీతికి పాల్పడ్డారని, సుమారు రూ.100 కోట్లు అవినీతి జరిగిందని ఆమెపై విజయవాడ వాసి ఒకరు సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. కేసులో ప్రధాన నిందితురాలిగా మాజీ మంత్రి రోజాను గుర్తించారని, ఆమె అరెస్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి అనుమతి రావాల్సివుందని ప్రచారం జరుగుతోంది.
రోజా అరెస్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చకు దారితీస్తోంది. టీడీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యలపై విమర్శలతో విరుచుకుపడే రోజాను కట్టడి చేసేందుకు ఇదే సరైన సమయని గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేక మహిళలపై కక్ష సాధింపుల వల్ల పార్టీకి, తనకు బ్యాడ్ ఇమేజ్ వస్తుందని వెనక్కి తగ్గుతారా? అనేదానిపై క్లారిటీ రావాల్సివుంది. ‘ఆడుదాం ఆంధ్రా’ ఆటల పోటీల్లో అవినీతి జరిగిందని సీఐడీ ప్రాథమికంగా నిర్ధారించిందని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దని ఉన్నతాధికారులు ఆదేశించడంతో కేసు దర్యాప్తును ఆపినట్లు చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలను వరుసగా టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి ఆయన క్యాబినెట్ లో మంత్రులుగా పనిచేసిన వారిలో ఎక్కువ మందిపై ఏదో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోజాతోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ పైనా సీఐడీకి ఫిర్యాదు అందింది. గత ప్రభుత్వంలో రోజా క్రీడాశాఖ మంత్రిగా ఉండగా, క్రిష్ణదాస్ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. దీంతో వీరిద్దరిపై విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదు చేశారు. గత ఏడాది ఆగస్టులో ఈ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు ప్రాథమిక ఆధారాలు సంపాదించినట్లు చెబుతున్నారు.
అయితే వైసీపీ నేతలపై వచ్చిన అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్కరినీ అరెస్టు చేయించలేదు. ప్రస్తుతానికి అరెస్టు అయిన వారిలో ప్రతి ఒక్కరు ఇతర కేసుల్లో నిందితులుగా ఉన్నవారే. టీడీపీ కార్యాలయంపై దాడితోపాటు హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మాత్రమే అరెస్టు చేసేందుకు సీఎం అనుమతి ఇస్తున్నారు. అవినీతి కేసులల్లో అరెస్టులపై రాజకీయ నిర్ణయం కోసం తగిన సమయం వచ్చేవరకు వేచిచూడాలని చెబుతున్నారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు తీవ్ర ఒత్తిడికి లోనై ప్రభుత్వంపై విమర్శలకు వెనక్కి తగ్గతున్నారు. రేషన్ బియ్యం కేసులో ఇరుకున్న మాజీ మంత్రి పేర్ని నాని ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అవ్వగా, ఇప్పుడు రోజాకు అదే పరిస్థితి ఎదురవుతోందని అంటున్నారు. మరి వైసీపీ అధికారి ప్రతినిధిగా ఉన్న రోజా ప్రభుత్వం చర్యలకు భయపడకుండా తన గళం విప్పుతారా? లేక ఆమె కూడా మౌనాన్ని ఆశ్రయిస్తారా? అన్నది చర్చనీయాంశమవుతోంది.