ఏపీలో టాటా పెట్టుబడుల వర్షం... కీలక విషయాలు వెల్లడించిన బాబు!
ఇప్పటికే విశాఖలో టీసీఎస్ గురించి మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ సమయంలో చంద్రబాబు ఎక్స్ వేదికగా మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.
By: Tupaki Desk | 12 Nov 2024 6:59 AM GMTఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ పెట్టుబడులకు మార్గాలు సుగమం అవుతున్నాయని.. ఈ సమయంలో రాష్ట్రాభివృద్ధిలో టాటా గ్రూపు ఒక ముఖ్యమైన వాటాదారుగా కొనసాగుతోందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విశాఖలో టీసీఎస్ గురించి మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ సమయంలో చంద్రబాబు ఎక్స్ వేదికగా మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.
అవును... ఇటీవల ఏపీలో యువతకు గుడ్ న్యూస్ వినిపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో భేటీ అనంతరం.. ఏపీలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు. ఇదే సమయంలో 100 రోజుల్లోనే విశాఖలో టీసీఎస్ క్యాంపస్ కు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు.
మరోపక్క తాజాగా సోమవారం నటరాజన్ చంద్రశేఖరన్ తో చర్చించిన చంద్రబాబు... మరిన్ని శుభవార్తలను ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగా... పర్యాటక, పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో మరో 20 హోటళ్లను ఏఋపాటు చేయాలని టాటా సంస్థలకు చెందిన ఇండియన్స్ హోటల్స్ భావిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
ఈ సందర్భంగా వివరాలు వెల్లడించిన చంద్రబాబు... చంద్రశేఖరన్ తో జరిగిన సమావేశంలో కీలక రంగాల గురించి చర్చించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా.. విశాఖలో కొత్తగా ఐటీ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు టీసీఎస్ కట్టుబడి ఉందని.. సుమారు 10 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పినట్లు తెలిపారు. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల గురించి వెల్లడించారు.
వీటితో పాటు టాటా పవర్ 5వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రూ.40 వేల కోట్లు పెట్టుబడులు పెడుతోందని.. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ లను వినియోగించి పరిష్కారాలను కనుగొనే విషయంలొ సహకారం అందించడంపైనా చర్చించినట్లు తెలిపారు.