Begin typing your search above and press return to search.

నొప్పించ‌క‌.. తానొవ్వ‌క‌.. త‌మ్ముళ్ల‌కు చంద్ర‌బాబు 'క్లాస్‌'

ఏపీ సీఎం చంద్ర‌బాబు సుమ‌తీ శ‌త‌కంలోని ప‌ద్యాన్ని గుర్తుచేశారు. `నొప్పించ‌క‌-తానొవ్వ‌క‌-త‌ప్పించుకు తిరుగువాడే ధ‌న్యుడు!` అన్న‌ట్టు వ్యవ‌హ‌రించారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 4:38 AM GMT
నొప్పించ‌క‌.. తానొవ్వ‌క‌.. త‌మ్ముళ్ల‌కు చంద్ర‌బాబు క్లాస్‌
X

ఏపీ సీఎం చంద్ర‌బాబు సుమ‌తీ శ‌త‌కంలోని ప‌ద్యాన్ని గుర్తుచేశారు. `నొప్పించ‌క‌-తానొవ్వ‌క‌-త‌ప్పించుకు తిరుగువాడే ధ‌న్యుడు!` అన్న‌ట్టు వ్యవ‌హ‌రించారు. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన నాలుగు మాసాల్లోనే టీడీపీ నాయ‌కులు చెల‌రేగిపోతున్నారంటూ.. టీడీపీ అనుకూల మీడియాలోనే పేజీల‌కు పేజీల లెక్క క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఒక విష‌యం.. ఒక జిల్లా.. ఒక నేత అయితే.. పెద్దగా ఎవ‌రూ ప‌ట్టించుకునే వారు కూడా కాదేమో. కానీ, కీల‌క‌మైన అన్ని విష‌యాల్లోనూ.. అన్ని జిల్లాల్లోనూ.. చాలా మంది నాయ‌కులు వేళ్లు - కాళ్లు పెట్టేస్తున్నారు.

ఇసుక నుంచి మ‌ద్యం వ‌ర‌కు.. ఎందెందుకు వెదికినా.. అందందే... త‌మ్ముళ్ల మేత తేట‌తెల్లం అవుతోంది. ఇది.. సీఎం చంద్ర‌బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఏదో ఒక‌టి చేయ‌క‌పోతే.. అనుకూల మీడియా ఇక‌, ఆగేట్టు లేద‌నుకున్నారో .. ఏమో.. హుటాహుటిన ఆయ‌న తాజాగా అంద‌రినీ పిలిపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు.. అంద‌రినీ కూర్చోబెట్టి.. `క్లాస్` ఇచ్చారు. అయితే.. పొరుగు పార్టీ.. వైసీపీ వెంట‌నే అలెర్ట్ అయింది. ఇంకేముంది.. చంద్ర‌బాబు త‌మ్ముళ్ల‌ను భారీ ఎత్తున కడిగేస్తార‌ని భావించింది.

కానీ, అనూహ్యంగా చంద్ర‌బాబు పైన చెప్పుకొన్న‌ట్టుగా.. నొప్పించ‌క‌.. తానొవ్వ‌క‌.. అన్న‌ట్టుగా.. సుతిమెత్త‌గా క్లాస్ ఇచ్చారు. ``వాళ్ల‌లాగా(వైసీపీ) మ‌నం(ఆయ‌న‌ను కూడా క‌లుపుకొని.. త‌మ్ముళ్ల‌కు ఇబ్బంది లేకుండా మాట్లాడారు) చేస్తే.. వాళ్ల‌కు మ‌న‌కు తేడా ఏముంటుంది!`` అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏం జ‌రిగిందో అంతా త‌న‌కు తెలుసున‌ని కూడా చెప్పారు. కానీ, తాను ఎవ‌రినీ ఏమీ అన‌డం లేద‌ని.. తెలిసి చేశారో.. తెలియ‌క చేశారో.. అయిపోయింద‌న్నారు.

ఇక‌, నుంచి మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాలని సుతిమెత్త‌గా హిత‌వు ప‌లికారు. 125 రోజుల పాలనలో కూట‌మి స‌ర్కారు ముఖ్యంగా టీడీపీ చేసిన మంచి పనులు సమీక్షించుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఈ విష‌యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని కూడా కోరారు. ఇక‌, ఇత‌ర విష‌యాల‌పై సోదాహ‌ర‌ణంగా ప్ర‌సంగించారు. అయితే.. వాస్త‌వానికి ఇది కాదు క‌దా.. కావాల్సింది! ఇసుక‌, మ‌ద్యం విష‌యాల్లో త‌మ‌ళ్లు చేసిన ప‌నులు ఇంకా కొన‌సాగుతున్నాయి. వాటిని గ‌ట్టిగా నిల‌దీయాలి క‌దా! అంటే.. ఆ విష‌యంలో చంద్ర‌బాబు మెత‌క వైఖ‌రినే ప్ర‌ద‌ర్శించారు. ఫ‌లితంగా.. త‌మ్ముళ్లు రెచ్చిపోకుండా ఉంటార‌ని అనుకోవ‌డం భ్ర‌మేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.