ఎమ్మెల్యే తమ్ముళ్ల ఆగ్రహం.. బాబు పట్టించుకోరా ..!
టీడీపీలో చిత్రమైన రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరు నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు
By: Tupaki Desk | 18 Nov 2024 11:30 PM GMTటీడీపీలో చిత్రమైన రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరు నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే.. ఎవరూ బయట పడకపోయినా.. సమయం సందర్భం చూసుకుని రెచ్చిపోతున్నారు. తాజాగా అసెంబ్లీ వేదికగా చోటు చేసుకున్న రెండు పరిణామాలు.. ఇద్దరు ఎమ్మెల్యేల ను గమనిస్తే.. వారు ఎందుకు అలా రగిలిపోతున్నారో అర్ధం చేసుకోవచ్చు. సీనియర్లుగా ఉండడమే కాకుండా.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నామన్న భావన వారిలో ఉంది.
దీంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తమకు కీలక పదవులు దక్కుతాయని కూడా సదరు నేతలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మంత్రి పీఠాలు దక్కుతాయని భావించారు. కానీ, కూటమి పార్టీల ఎఫెక్ట్ కావొచ్చు.. ఇతర కారణాలు కావొచ్చు.. మంత్రి పదవులు దక్కలేదు. ఇలాంటివారిలో గూడుకట్టుకున్న అసహనం.. అసెంబ్లీలో ఇప్పుడు స్ఫష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అందుకే వారు.. గత నాలుగు రోజులుగా సభలో ఒకరకంగా యుద్ధానికే దిగుతున్నారు.
`ఇప్పటి వరకు మాట్లాడిన వారిలో నాకన్నా సీనియర్లు లేరు` అని జగ్గపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలు.. దీనికి కొనసాగింపుగా.. ఆయన ప్రదర్శించిన అసహనం వంటివి చర్చకు దారితీశాయి. నిజానికి మంత్రి వర్గంలో చోటు కోసం ఎదురు చూసిన వారిలో జ్యోతుల కూడా ఉన్నారు. అయితే.. కాపుల కోటాలో ఎక్కువ మంది ఉండడంతో ఆయనకు ఆ పదవి దక్కలేదు. దీంతో ఉప సభాపతి పోస్టు అయినా దక్కకపోతుందా? అని అనుకున్నారు.
కానీ, అది క్షత్రియుల కోటాలో రఘురామకృష్ణ రాజుకు దక్కింది. దీంతో జ్యోతుల ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదిలావుంటే, మరోవైపు.. తన వర్గానికి చెందిన ఇద్దరు కీలక నాయకులకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకోవాలని చూశారు. కానీ, అది కూడా సాధ్యం కాలేదు. ఈ పరిణామాలే.. జ్యోతులకు ఇబ్బందిగా మారి.. సభలో అసహనం ప్రదర్శించే పరిస్థితిని తీసుకువచ్చింది. అదేవిధంగా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ పరిస్థితి కూడా ఉండడం గమనార్హం.