బాబు కోపాగ్ని.. సన్నిహితులైనా బలి కావాల్సిందే..
తనకు కోపం తెప్పించిన అధికారులపై ఒక్క మాటతో వేటు వేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం తెస్తే సన్నిహితులైనా చర్యలు తప్పవని తేల్చిచెప్పారు
By: Tupaki Desk | 10 Jan 2025 12:51 PM GMTముఖ్యమంత్రి చంద్రబాబు శాంతి స్వరూపుడని, ఆయన కోపం పాల పొంగులా చప్పున చల్లారిపోతుందని అధికార యంత్రాంగంలో చెప్పుకుంటుంటారు. అందుకే చంద్రబాబు సీరియస్ వార్నింగులను అధికారులు పెద్దగా పట్టించుకోరు. ముఖ్యమంత్రి కోపం తగ్గాక మళ్లీ మామూలు అయిపోతారని భావిస్తుంటారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు వైఖరిలో వచ్చిన మార్పు అధికార యంత్రాంగాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. తనకు కోపం తెప్పించిన అధికారులపై ఒక్క మాటతో వేటు వేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం తెస్తే సన్నిహితులైనా చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.
తిరుపతి తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ ఆ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడిపై చర్యలు తీసుకోవడం అధికార వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకు ఎస్పీగా సుబ్బరాయుడిని ఏరికోరి తెచ్చుకున్నారు. ఆయన ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు కూడా కాకుండానే ఆకస్మికంగా బదిలీ వేటు వేయడం సంచలనం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా భావించే సుబ్బరాయుడిపై ఇలా వేటువేయడం ఎవరూ ఊహించలేదు. ఈ చర్యతో ఏమరపాటుతో ఉంటే ఎవరిపైనైనా చర్యలు తప్పవనే సంకేతాలిచ్చారు సీఎం చంద్రబాబు.
2014-19 మధ్య ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రతాధికారిగా సుబ్బరాయుడు పనిచేశారు. సీఎం చంద్రబాబు మనసు ఎరిగి పనిచేస్తారని ఆయనకు పేరుంది. చంద్రబాబు ఎలా ఉండాలని అనుకుంటారో? అధికారుల నుంచి ఆయన ఏం కోరుకుంటారో అన్న విషయాలపై సుబ్బరాయుడికి పూర్తిగా స్పష్టత ఉంది. అందుకే తెలంగాణ క్యాడరులో ఉన్న ఆయనను డెప్యుటేషన్ పై తెప్పించి తిరుపతి ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. ఈ విషయం తెలిసే సోషల్ మీడియా అరెస్టులు, ఇతర సందర్బాల్లో ఆయనపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుబ్బరాయుడు గుర్తించుకో.. తాను అధికారంలోకి వస్తే నువ్వు తెలంగాణ వెళ్లిపోయినా వదిలేది లేదంటూ జగన్ ఇచ్చిన వార్నింగ్ ఎంతో వైరల్ అయింది. జగన్ వార్నింగ్, యాక్షన్ మాట అటుంచితే చంద్రబాబు, సుబ్బరాయుడు మధ్య ఎంతటి బాండింగ్ ఉన్నదనే విషయం ప్రతిపక్షాలతో సహా అందరికీ అవగాహన ఉంది.
అంతటి సన్నిహితుడైనప్పటికీ తిరుపతి ఘటనలో ఆరుగురు చనిపోవడంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన సందర్భంలో పోలీసు భద్రత విషయంలో సుబ్బరాయుడు సరిగా స్పందించలేదని భావిస్తూ ఆయనపై వేటు వేశారు. తిరుపతిలో నిర్ణయం తీసుకున్న చంద్రబాబు విజయవాడలో అడుగు పెట్టేలోగా సుబ్బరాయుడి బదిలీపై ఉత్తర్వులు రావడం అధికార యంత్రాంగానికి షాక్ గా చెబుతున్నారు.
ఇన్నాళ్లు మాటలతో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు యాక్షనులోకి దిగిపోయారని ఈ సంఘటనతో తేలిపోయిందంటున్నారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నుంచి క్రమశిక్షణపైనా బాధ్యతారాహిత్యంపైనా ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లాసు పీకుతూనే ఉన్నారు. చివరికి తాను మారితే కానీ, పరిస్థితిలో మార్పురాదని అనుకున్నారేమో తన సన్నిహితుడిపైనే వేటు వేసి అందరికీ గట్టి సంకేతం పంపారంటున్నారు. ఇకనైనా నిర్లక్ష్యంతో పనిచేసేవారు మారకుంటే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చినట్లే అంటున్నారు.