ఎమ్మెల్యేల కోసం.. చంద్రబాబు సాహసం!
తన పార్టీ ఎమ్మెల్యేల కోసం అధినేతలు ఎంతో కొంత సాహసం చేయడం రాజకీయాల్లో కామనే.
By: Tupaki Desk | 20 Oct 2024 10:04 AM GMTతన పార్టీ ఎమ్మెల్యేల కోసం అధినేతలు ఎంతో కొంత సాహసం చేయడం రాజకీయాల్లో కామనే. గతంలో వైసీపీ అధినేత, సీఎంగా ఉన్నజగన్‌కూడా.. క్షేత్రస్థాయిలో నాయకులు బట్టలు విప్పి చూపించినా.. మౌ నంగా ఉన్నారు. అరె వాళ్లు కసరత్తులు చేస్తున్నారయ్యా! ఇది కూడా తప్పేనా? అంటూ.. సమర్థించుకు న్నారు. అయితే..టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఇంత దారుణంగా వ్యవహరించకపోయినా.. కొంతలో కొంత ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం.. సాహసమే చేశారని చెప్పాలి.
తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీల సంస్కృతిని తగ్గించాలని స్వయంగా చంద్రబాబు చెప్పారు. ఇది జరిగి.. 10 రోజులు కూడా కాలేదు. ఇటీవల తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్లి.. పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు ఈ సందర్భంగానే వీఐపీ సంస్కృతిని తగ్గించాలని సూత్రీకరించారు. ఆయన ఉద్దేశం మంచిదే అయినా.. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోయారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. వీఐపీ కోటాను తగ్గించేస్తే ఎలా అంటూ వాపోయారు.
దీనిపై చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు మనసు కరిగిపోయింది. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని తనే వెనక్కి తీసుకుని.. ఎమ్మెల్యేల కోసం.. సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు తిరుమల దర్శనాల కోటా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారంలో ఆరు రోజుల పాటు.. ఎమ్మెల్యేలు శ్రీవారిని నేరుగా దర్శించుకునే అవకాశం కల్పించాలని ఈవో జె. శ్యామలరావును మౌఖికంగా ఆదేశించారు.
సీఎం చంద్రబాబు ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి విన్నపాలను పరిశీలించి.. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల దర్శనాలకు సంబంధించి.. ప్రస్తుతం వారంలో నాలుగు రోజులపాటు ఎమ్మెల్యేల సిఫారసు లేఖల్ని అనుమతిస్తున్నారు.(వీఐపీలుగా). అయితే ఇకపై వాటిని ఆరు రోజులకు పెంచేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. అలాగే వారికి వారంలో ఆరు రోజులపాటు, రోజుకి ఆరు చొప్పున సుపథం (రూ.300 టికెట్) ఇచ్చేందుకూ ఓకే చెప్పారు. అయితే.. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడడం గమనార్హం. మరి చంద్రబాబు చేసిన ఈ సాహసోపేత నిర్ణయంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.