దటీజ్ చంద్రబాబు...మొత్తానికి సాధించారు !
చంద్రబాబు అంటే జనాలకు ఎందుకు నమ్మకమో మరో మారు రుజువు అయింది. బాబు విజనరీ అంటారు.
By: Tupaki Desk | 17 Jan 2025 12:39 PM GMTచంద్రబాబు అంటే జనాలకు ఎందుకు నమ్మకమో మరో మారు రుజువు అయింది. బాబు విజనరీ అంటారు. ఆయన డెవలప్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ అంటారు. అవన్నీ ఈ తరానికి మరోసారి తెలిసి వచ్చేలా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బాబు నాల్గవసారి సీఎం అయిన తరువాత పూర్తి స్థాయిలో ఏపీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారు. కేవలం ఆరు నెలల కాలంలోనే ఆయన అమరావతి రాజధానికి ఒక రూపు ని తెచ్చే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు.
అలాగే పోలవరం ప్రాజెక్ట్ పరిపూర్తికి నిర్దిష్ట గడువు పెట్టుకుని మరీ కేంద్రం నుంచి రావాల్సిన భారీ మొత్తం 11 వేల కోట్ల రూపాయలను వచ్చేలా చూసారు. ఇక నాలుగేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కంటికి కునుకు లేకుండా పోరాటం చేస్తున్నారు. విశాఖ వాసులు సైతం కలవరపడుతున్నారు. ఉత్తరాంధ్ర అంతా ఆవేదనతో ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఐదున్నర దశాబ్దాల క్రితం పోరాడిన ఏపీ జనాలు అంతా విశాఖ ఉక్కుకు ప్రైవేట్ పీడ తగలకూడదని కోటి దండాలు పెట్టుకుంటూ వచ్చారు.
ఇక ఉత్తరాంధ్ర మొత్తం ఒక్కటై కూటమికి ఓటేసి గెలిపించింది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని చంద్రబాబు కాపాడుతారనే. ఆ విధంగా జనాలు పెట్టుకున్న ఆశలను చంద్రబాబు ఆరు నెలలు తిరగకుండానే నెరవేర్చారు. అనుకున్నది సాధించారు. నిజానికి చూస్తే అంతా పోరాటాలు చేస్తున్నారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ చేజారింది అనే అనుకున్నారు. ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి.
ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గేది ఉండదని అంటారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆయన ఆర్భాటంగా బయటకు ప్రకటనలు చేయలేదు. కానీ ఏమి చేయాలో అలా చేశారు. మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కి కొత్త ఊపిరి పోశారు
భారీ ఆర్ధిక ప్యాకేజిని విశాఖ స్టీల్ ప్లాంట్ కి సాధించడం ద్వారా బాబు తన అనుభవాన్ని పరిపాలనా దక్షతను మరోసారి ఘనంగా చాటుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇక కొత్త ఊపిరి వచ్చినట్లు అయింది. త ద్వారా విశాఖ ఉక్కు నగరం పేరు పూర్తిగా శాశ్వతం అయినట్లు అయింది. ఉత్తరాంధ్రకు బంగారం లాంటి ప్లాంట్ కొండంత అండగా ఉంది. ఏపీకి గర్వకారణంగా విశాఖ ఉక్కు ఎవరెస్ట్ శిఖరంగా నిలిచి ఉంటోంది.
ఇవన్నీ సాధించిన బాబుని నిజంగా గ్రేట్ అనే చెప్పాలని అంటున్నారు. విశాఖలో ఇటీవలనే రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చి మెగా సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఇపుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి భారీ ప్యాకేజి ని తీసుకుని రావడం ద్వారా ఉత్తరాంధ్రా ప్రజలకు మరింతగా దగ్గర అయ్యారు. ఉత్తరాంధ్ర అంటేనే టీడీపీకి కంచుకోట. ఇపుడు ఈ నిర్ణయంతో మరోమారి కూటమి ప్రభుత్వానికి ఈ ప్రాంతీయులు అంతా జై కొడుతున్నారు. బాబు కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడింది అని కీర్తిస్తున్నారు.