వైసీపీ లోకల్ లీడర్లకు చంద్రబాబు బెస్ట్ ఆఫర్
వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఊపిరిపీల్చుకునేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 20 Dec 2024 6:30 AM GMTవైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఊపిరిపీల్చుకునేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ పాలకవర్గాలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నిర్ణయించిన గడువు కాలాన్ని తగ్గించాలనే ప్రతిపాదనను మంత్రివర్గం తిరస్కరించింది. దీంతో వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు ఐదేళ్ల పదవీకాలాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు మున్సిపాలిటీలు మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తుల్లో వైసీపీ నేతలే పదవులు అనుభవిస్తున్నారు.
గతంలో వీటి ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంతో అన్నిచోట్లా సునాయాశంగా గెలిచింది వైసీపీ. కేవలం తాడిపత్రి, దర్శి, కొండపల్లి మున్సిపాలిటీల్లో మాత్రమే స్థానిక టీడీపీ నేతలు పట్టుదలగా పనిచేసి విజయం సాధించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు మొదలయ్యాయి. దీంతో మున్సిపల్ చైర్మన్లు, మేయర్లపై అవిశ్వాసం ప్రవేశపెట్టి వారిని దించేయాలని డిమాండ్ మొదలైంది. అయితే వీరి పదవీకాలం 2026 మార్చివరకు ఉండటం, మరో ఆర్నెళ్ల వరకు అవిశ్వాసం పెట్టే వీలు లేకపోవడంతో వైసీపీ నేతలే పదవుల్లో కొనసాగుతున్నారు. స్థానిక సంస్థల్లో అవిశ్వాసం పెట్టాలంటే కనీసం నాలుగేళ్లు పూర్తవ్వాలి. దీంతో ఈ చట్టానికి మార్పలు చేయాలని కొందరు మంత్రులు ప్రతిపాదిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించారు. మరో ఏడాదిన్నరలో పదవులు కోల్పోయేవారి కోసం చట్టాన్ని మార్చడమెందుకని సీఎం అన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంతో వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు పదవీ గండం తప్పిపోయినట్లే.. కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి పట్టణ, నగరపాలక సంస్థల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు దినదిన గండంగా గడుపుతున్నారు. అధికార పార్టీ ఒత్తిడితో ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లో చైర్మన్లు, మెజార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతోపాటు హిందూపురం, పుంగనూరు, జగ్గయ్యపేట, మాచర్ల వంటి మున్సిపాలిటీల్లో చైర్మన్లు, కౌన్సిలర్లు పార్టీలు మారారు. అదేవిధంగా చిత్తూరు, ఒంగోలు, ఏలూరు మున్సిపాలిటీల్లోనూ అధికారం చేతులు మారింది. స్థానిక ఎన్నికలు బహిష్కరించడంతో పట్టణ పాలకవర్గాల్లో టీడీపీకి ఇన్నాళ్లు ప్రాతినిధ్యమే లేదు. కడప నగరపాలక సంస్థల్లో ఎమ్మెల్యేకు కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా వేయని పరిస్థితి తలెత్తింది. అయినప్పటికీ పాలక వర్గాల గడువు తక్కువగా ఉండటంతో అవిశ్వాసం జోలికి వెళ్లకూడదని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
సీఎం నిర్ణయంతో వైసీపీ ప్రజాప్రతినిధులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఐదేళ్లపాటు తమ పదవులను ఎంజాయే చేసే అవకాశం దక్కడంతో మిగిలిన పదవీకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే సీఎం నిర్ణయంతో టీడీపీలో దిగువస్థాయి క్యాడర్ నిరుత్సాహ పడినట్లు చెబుతున్నారు. వైసీపీ నేతలను దించేస్తే ఆ పదవుల్లో తాము కూర్చోవచ్చనని భావించిన వారి ఆశలపై ముఖ్యమంత్రి నీళ్లు పోశారంటున్నారు. అయితే చంద్రబాబు ముందుచూపుతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని, భవిష్యత్తులో తమ నేతలకు కూడా పదవీ గండం లేకుండా ఉండాలనే ఆలోచనతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఏదిఏమైనా పార్టీ అధికారంలో లేకపోయినా, వైసీపీ నేతలకు మాత్రం కూటమి ప్రభుత్వం నుంచి జాక్ పాట్ అందిందనే చెప్పాలి.