బీజేపీ తరఫున పవన్ రాయబారం.. చంద్రబాబుతో భేటీ!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలుసుకున్నారు.
By: Tupaki Desk | 4 March 2025 1:10 PM ISTఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఒకవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లి.. సుమారు అరగంటకు పైగానే ఆయనతో భేటీ అయ్యారు. తాజాగా సోమవారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధిం చిన నోటిఫికేషన్ రావడం.. ఇదేసమయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి పవన్ కల్యాణ్‌కు ఫోన్ వచ్చిందన్న సమాచారం నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం చోటు చేసుకుంది.
విషయం ఏంటి?
ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఐదు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో ఒకటి జనసేనకు కేటాయిం చినట్టు తెలిసింది. పవన్ కల్యాణ్ సోదరుడు.. నాగబాబును ఎమ్మెల్యే కోటాలో సభకు పంపించే అవకాశం ఉంది. అటు నుంచి మంత్రివర్గంలోకి ఆయనను తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇక, నాలుగు స్థానాలను కూడా టీడీపీదక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి.. ఇప్పుడు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇదేసమయంలో మహిళలకు కూడా ప్రాదాన్యం ఇస్తారని.. వాసిరెడ్డి పద్మ, పోతుల సునీతలలో ఒకరినిసభకు పంపిస్తారని చర్చ సాగుతోంది.
అయితే.. మొత్తంగా నాలుగు సీట్లు టీడీపీ తీసుకుంటున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడు వచ్చిన అవకాశం మున్ముందు రాదని భావిస్తున్న(ఎందుకంటే.. మరో ఏడాది వరకు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు) బీజేపీ నాయకులు తమకు ఒక సీటును కేటాయించాలని.. తద్వారా ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్ లేదా.. సోము వీర్రాజును సభకు పంపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా.. వీరిద్దరికి ఆర్ ఎస్ ఎస్ తో అనుబంధం బలంగా ఉన్న క్రమంలో వారికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్నది కమల నాథుల నుంచి వినిపిస్తున్నమాట. అయితే.. దీనిపై చంద్రబాబు ఒప్పుకోవడం లేదని సమాచారం.
తర్వాత చూద్దామంటూ.. ఆయన ఇటీవల కూడా దాట వేశారు. ఇదిలావుంటే.. సోము, మాధవ్‌లకు కేంద్రంలోనిపెద్దలతోనూ అవినాభావ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో వారు ఢిల్లీ స్థాయిలోనే చక్రం తిప్పుతున్నట్టు గత రెండు రోజులుగా బీజేపీలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ద్వారా ప్రాథమికంగా బీజేపీ ఒకస్థానం కోసం కర్చీఫ్ వేసే ప్రయత్నాలు ముమ్మరం చేసిందని అందుకే.. పవన్ ను రాయబారిగా పంపించి ఉంటుందని అమరావతి వర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. ప్రస్తుతం బీజేపీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ.. మండలిలో అంతగా లేదు. దీంతో తమ మిత్రుడు పవన్ ద్వారా ప్రాధమికంగా చంద్రబాబుకు సమాచారం చేరవేసేందుకు.. ఆయనను పంపించి ఉంటారన్న చర్చ అయితే..జోరుగా సాగుతోంది.దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉంది.