Begin typing your search above and press return to search.

బాబు పవన్ బాగానే ఇచ్చి పుచ్చుకుంటున్నారు !

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ ఉందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 March 2025 3:30 PM
Chandrababu and Pawan Kalyan Bonding
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుని తగినట్లుగా వ్యవహరిస్తారు. రాజకీయాల్లో ఎంతో సీనియర్ మోస్ట్ లీడర్ అయినప్పటికీ చంద్రబాబు పవన్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ విషయంలో ఎక్కడా రాజీపడరు.

పవన్ ని తన వెంటే ఉంచుకుంటారు. పవన్ గురించి బాగానే మాట్లాడుతూ రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలు కొనసాగించేందుకే చూస్తూ వస్తున్నారు. ఇక పవన్ సైతం బాబు సీనియారిటీని గౌరవిస్తారు. ఆయన నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టం అంటారు. బాబు దగ్గర చాలా నేర్చుకుంటాను అని అంటారు. ఇక జనసేన ఆవిర్భావ దినోత్సవం ఇటీవల జరిగితే చంద్రబాబు లోకేష్ ఇద్దరూ పవన్ కి అభినందనలు తెలియచేశారు. జనసేన మరింతగా ముందుకు సాగాలని పవన్ ఆశయాలు నెరవేరాలని మనసారా కోరుకున్నారు.

ఇపుడు పవన్ కూడా అదే విధంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేళ రెస్పాండ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీని ఆయన ఆకాశానికి ఎత్తేశారు. చరిత్ర సృష్టించిన పార్టీగా అభివర్ణించారు. ఎన్టీఆర్ పార్టీని పెట్టి తొమ్మిది నెలలలో అధికారంలోకి తీసుకుని వచ్చారని కూడా పవన్ గుర్తు చేశారు. టీడీపీ క్యాడర్ కి అభినందనలు తెలిపారు.

ఈ విధంగా రెండు పార్టీల మధ్య ఒక మంచి అనుబంధం ఉందని చెప్పడానికి ఈ రకమైన చర్యలు ఎంతగానో దోహదపడుతున్నాయి. గతంలో ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్స వేడుకలు అంటే కేవలం ఆ పార్టీ అంశంగానే ఉంటూ వచ్చేది. వేరే పార్టీ వారు దాని గురించి పెద్దగా పట్టించుకునే వారు కాదు విషెస్ చెప్పడం అన్న కల్చర్ అయితే లేనే లేదు అన్నట్లుగా అంతా ఉండేది.

ఇక పొత్తులు పెట్టుకుని మిత్రులుగా ఉన్నా కూడా ఎవరి సొంత రాజకీయం వారిదే అన్నట్లుగా వ్యవహారం సాగిపోయేది. ఇపుడు కూడా చూస్తే కనుక కూటమిలో మూడు పార్టీలు ఉన్నా ఎక్కువ బాండింగ్ అన్నది టీడీపీ జనసేనల మధ్యనే కనిపిస్తోంది అని అంటున్నారు. బాబు గురించి పవన్ కి తెలుసు. అలాగే పవన్ ఏమిటి అన్నది బాబు గుర్తించారు అని చెబుతున్నారు. అందుకే అధినాయకుల మధ్యన మంచి అండర్ స్టాండింగ్ ఉండడంతో అది పార్టీల మధ్య కూడా కొనసాగుతోంది అని అంటున్నారు.

ఏది ఏమైనా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనవి. అవి ప్రజల కోసం సేవ చేసేందుకు ఏర్పాటు అయినవి. ఈ విషయంలోనే ఇతర పార్టీలతో పోటీ ఉంటుంది. అలా చూసుకుంటే పార్టీలు అన్నీ ప్రత్యర్ధులుగానే ఉంటాయి తప్ప శత్రువులుగా కాదు ఈ విషయం తెలుసుకుని అంతా ప్రజల కోసం పాటుపడుతున్నామని భావిస్తూ ఉంటే కనుక మంచి రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది అని అంటున్నారు. టీడీపీ జనసేన మాత్రం కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయగలిగారు అని అంటున్నారు.