ఇంట పవన్.. బయట చంద్రబాబు..!
ఏపీలో కూటమి సర్కారును నడిపిస్తున్న రెండు చక్రాల్లో ఒకటి సీఎం చంద్రబాబు, రెండు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
By: Tupaki Desk | 29 Oct 2024 10:30 PM GMTఏపీలో కూటమి సర్కారును నడిపిస్తున్న రెండు చక్రాల్లో ఒకటి సీఎం చంద్రబాబు, రెండు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కూటమిని కట్టడంలోనూ.. వైసీపీని గద్దె దించడంలోనూ ప్రముఖ పాత్ర పోషించిన పవన్‌కు చంద్రబాబు అడగకుండానే డిప్యూటీ సీఎం పదవిని అప్పగించారు. ఇక, పాలన విషయంలోనూ..ఆయన కు సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చారు. దీంతో ఇంట విషయాలను పవన్ చక్క బెడుతుండడంతో చంద్రబాబు బయట విషయాలను చూసుకుంటున్నారు.
ఉదాహరణకు.. ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలను డిప్యూటీ సీఎం చూస్తున్నారు. ముఖ్యంగా రహదారుల విషయం నుంచి ఉపాధి హామీ విషయం వరకు పవన్ తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. అదేవిదంగా అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదంటూ.. ఆయన చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటు న్న నిర్ణయాలు కూడా.. కేవలం ఆయన మంత్రిత్వ శాఖలకే పరిమితం కాకుండా.. అందరికీ ఉపయోగ పడేలా వ్యవహరిస్తున్నారు.
దీంతో ఇంట పాలన విషయంలో పవన్ ముద్ర పడుతుండడం గమనార్హం. అందుకే.. ఎక్కువ మంది అధికారులు, బాధితులు కూడా.. పవన్ ను ఆశ్రయిస్తుండడం గమనార్హం. ఇక, బయట పాలన విషయానికి వస్తే.. పెట్టుబడుల రాక నుంచి పాలసీల నిర్మాణం వరకు చంద్రబాబు చూసుకుంటున్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు చంద్రబాబు 1995 నాటి ముఖ్యమంత్రి పాత్రను పోషించేందుకు వీలు కలుగుతోంది.
ఇదేసమయంలో మూడు పార్టీల సమన్వయం కోసం కూడా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అంటే.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పార్టీల మధ్య సమన్వయం.. పాలన పరంగా ప్రజలకు వివరించాల్సిన అంశాలు.. పథకాల రూపకల్పన వంటివి చంద్రబాబు చూస్తున్నారు. వీటి అమలును మాత్రం పవన్ నేతృత్వంలోని జనసేన మంత్రులు చూస్తున్నారు. దీంతో ఎక్కడా కూడా.. పాలన పరంగా పొరపొచ్చాలు.. అధికార వినియోగం పరంగా ఆధిపత్య ధోరణి లేకుండా ముందుకు సాగుతుండడం గమనార్హం.