బాబు వ్యూహం మారితేనే నిధుల వరద.. !
బుడమేరు వరదతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్‌కు పోటెత్తిన వరద లతో 62 గ్రామాల్లోనూ అంతే సీన్ కనిపిస్తోంది.
By: Tupaki Desk | 13 Sep 2024 1:30 PM GMTబుడమేరు వరదతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్‌కు పోటెత్తిన వరద లతో 62 గ్రామాల్లోనూ అంతే సీన్ కనిపిస్తోంది. దీనిలో పిఠాపురం నియోజకవర్గం కూడా ఉండడం గమనా ర్హం. దీంతో చంద్రబాబు ఆయా ప్రాంతాల్లో ఎక్కడకు వెళ్లినా.. సాయం కోసం అర్ధిస్తున్న చేతులే కనిపిస్తున్నాయి. తమను ఆదుకోవాలన్న ఆవేదనే వినిపిస్తోంది. అధికారం చేపట్టిన మూడు మాసాల్లోనే ఇంత విపత్తును ఎదుర్కొనాల్సి రావడం నిజంగానే.. ఎంత అనుభవం ఉన్న నాయకుడికైనా ఇబ్బందే.
పైగా గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని.. చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయినా.. కష్టం లో ఉన్నవారికి ఇవన్నీ కనిపించవు. వారికి కావాల్సింది చేయాల్సిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన వ్యూహం మార్చుకుంటే తప్ప.. రాష్ట్రంలో నిధుల వరద పారేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం కేంద్రంలో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు..అ నేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్లారు. పోలవరానికి నిధులు, అమరావతి నిర్మాణం వంటివాటిపై స్పందించారు.
అయితే..ఇప్పుడు ఆ రెంటికీ మించిన కష్టంలో ప్రజలు వున్నారు. వీరిని ఇప్పుడు సంతృప్తి కర స్థాయిలో ఆదుకోకపోతే.. చంద్రబాబుకు డ్యామేజీ మిగిలిపోతుంది. వచ్చే నాలుగున్నరేళ్లు.. ఆయన ఏం చేశారు.. ఏం చేస్తారు? అనేది ఎలా ఉన్నా.. ఇప్పుడు ప్రజలకు వచ్చిన కష్టం తీర్చడం ముఖ్యం. ఈ నేపథ్యంలో కేవలం నివేదికలు ఇచ్చి మౌనంగా ఉంటే కుదరదని, నేరుగా ఢిల్లీకి వెళ్లి అవసరమైతే.. రెండు రోజులు తిష్టవేసి అయినా.. నిధులు సాధించాలని పరిశీలకులు చెబుతున్నారు.
నిజానికి ఇప్పుడు చంద్రబాబు చేతిలో 15 మంది ఎంపీలు ఉన్నారు. మిత్రపక్షాలు జనసేనకు ఇద్దరు, బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. వీరందరినీ కలుపుకొని ఆయన ఢిల్లీకి వెళ్లి కూర్చుంటే తప్ప.. ఆయన ఆశించిన విధంగా నిధులు వచ్చే పరిస్థితి లేదు. కేంద్ర బృందాలు వచ్చి.. అవి సిఫారసులు చేసి.. ఆ తర్వాత నిధులు తెచ్చుకుందామంటే.. పుణ్యకాలం గడిచిపోతుంది. దీంతో ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతుంది. అప్పుడు ఎంత సాయం చేసినా.. పెదవి విరుపులే కనిపిస్తాయి. కాబట్టి.. చంద్రబాబు గేర్ తో పాటు వ్యూహం కూడా మార్చుకుంటే పని జరుగుతుందని అంటున్నారు పరిశీలకులు.